హైదరాబాద్‌ పేరు మారుతుందా..? 


హైదరాబాద్‌ పేరుని భాగ్యనగర్‌గా మార్చాలని ఎప్పటి నుంచో భాజపా డిమాండ్ చేస్తూనే ఉంది. నిజానికి తెలంగాణ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల్లో ఈ అంశమూ కీలకమైందే. ఇదే విషయాన్ని పలువురు భాజపా నేతలు ఎన్నో సార్లు ప్రస్తావించారు. ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోనే జరిగిన నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌ పేరుని భాగ్యనగర్‌గా మార్చాలని భాజపా గట్టిగానే ప్రయత్నిస్తోంది. కార్యవర్గ సమావేశంలోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేశారట. తన సూచనలు, సలహాలు అందించే ముందు, హైదరాబాద్‌ అనే పేరు కాకుండా భాగ్యనగర్‌ అనే పేరునే ఎక్కువ సార్లు పలికారని సమావేశంలో పాల్గొన్న నేతలు కొందరు చెబుతున్నారు. పేరు మార్చాలన్న సంకేతాల్ని, ప్రధాని మోదీ ఈ విధంగా ఇచ్చారని అంటున్నారు. 


సమావేశంలో ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? 


"సర్దార్ వల్లభాయ్ పటేల్ భాగ్యనగర్ కేంద్రంగానే, దేశాన్ని ఒక్కటి చేశారు. ఏక్‌ భారత్‌ నినాదాన్ని ఇచ్చారు. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భాజపాదే" అని ప్రధాని నరేంద్ర మోదీ కార్యవర్గ సమావేశంలో చెప్పారని భాజపా ఎంపీ రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. భాజపా నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కుమార్ కూడా హైదరాబాద్‌ పేరు మార్పునకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. "భాగ్యనగర్ వేదికగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్‌భారత్‌ను బహుమతిగా ఇచ్చారు. జేపీ నడ్డా నాయకత్వంలో మన దేశాన్ని శ్రేష్ఠ భారత్‌గా మార్చుతాం" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చాక, సీఎంసహా మిగతా కేబినెట్ మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటారని చాలా స్పష్టంగా చెప్పారు. 


అహ్మదాబాద్‌ను అదానీబాద్‌గా మార్చండి: కేటీఆర్ 


ఈ పేరు మార్పు అంశమే ప్రధాన అజెండాగా మార్చుకుంటోంది తెలంగాణ భాజపా. 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పటి నుంచే ఈ డిమాండ్ ఉంది. అప్పట్లోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మారాలంటే భాజపాకు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అహ్మదాబాద్‌ పేరుని అదానీబాద్‌గా ఎందుకు మార్చరంటూ విమర్శలు చేశారు.