తెలుగులో 'సింహరాశి', 'శివరామరాజు' లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేశారు సముద్ర. హీరో రాజశేఖర్ తో ఆయన 'సింహరాశి'తో పాటు 'ఎవడైతే నాకేంటి' అనే మరో సినిమా కూడా తీశారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి షేర్ చేసుకున్నారు. 

 

హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవితల కారణంగా ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించారు. 'ఎవడైతే నాకేంటి' సినిమా కంటే ముందు రాజశేఖర్ తో 'సింహరాశి' అనే సినిమా తీశారని.. అది పెద్ద సక్సెస్ అయిందని అన్నారు. ఆ తరువాత రాజశేఖర్ కి సరైన హిట్స్ లేవని.. ఆ సమయంలో కొన్ని సినిమాలను డైరెక్ట్ చేయమని తనను అడిగారని.. కానీ కథలు నచ్చకపోవడంతో ఒప్పుకోలేదని అన్నారు. 

 

కానీ రాజశేఖర్ మాత్రం తనతో పని చేయడం ఇష్టంలేకనే కారణాలు చెబుతున్నానని అనుకునేవారని.. 'ఎవడైతే నాకేంటి' కథ నచ్చడంతో డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే సమయానికి అవుట్ పుట్ బాగా వచ్చిందనే కాన్ఫిడెంట్ అందరిలో కలిగిందని చెప్పారు. దీంతో జీవిత, రాజశేఖర్ లు డైరెక్టర్ గా తన పేరు తీసేసి వాళ్ల పేర్లు వేసుకోవాలని అనుకున్నారని.. దాంతో షూటింగ్ సమయంలో తనను ఇరిటేట్ చేసేవారని తెలిపారు సముద్ర. 

 

దీంతో వాళ్లకు చెప్పేసి సినిమా నుంచి తప్పుకున్నానని.. ఆ తరువాత వాళ్లే రియలైజ్ అయి.. వచ్చి సినిమాను పూర్తి చేయమని కోరారని.. ఫైనల్ గా నా పేరు కింద వాళ్ల పేర్లు వేసుకున్నారని చెప్పుకొచ్చారు సముద్ర. తనకు అలాంటి అనుభవం ఎదురుకావడం అదే మొదటిసారని అన్నారు. 

 

ఇక రాజశేఖర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'శేఖర్' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జీవిత స్వయంగా డైరెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కావాల్సింది కానీ అతడు తప్పుకోవడంతో జీవిత మెగాఫోన్ పట్టుకుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం చిత్రాలకు ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ కూడా నటిస్తోంది.