Saripodhaa Sanivaaram Theatrical Rights: ‘హాయ్ నాన్న’ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కూతురు సెంటిమెంట్ తో నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ హిట్ జోష్ లో ఉన్న నాని, ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
హిట్ ఇవ్వకపోయినా వివేక్ ఆత్రేయకు మరో ఛాన్స్
వాస్తవానికి నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ వివేక్ ఆత్రేయని,సినిమా కథను నమ్మి మరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీ అనౌన్స్ మెంట్ వీడియోతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ‘సరిపోదా శనివారం’ షూటింగ్ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
దిల్ రాజు చేతికి ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ రైట్స్
తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి కీలక విషయం బయటకు వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అని తెలియడంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో నానికి మంచి సక్సెస్ అందడంతో పాటు దిల్ రాజుకు బాగానే డబ్బులు వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?
ఇక ‘సరిపోదా శనివారం’ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని నాని ఇటీవలే స్వయంగా వెల్లడించారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో సక్సెస్ అందుకున్న నాని ‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ విడుదల కానుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో కూడా ఐదు భాషల్లో విడుదల చేశారు మేకర్స్.
Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘నా సామిరంగ’ దూకుడు, 6 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే?