యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ... 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతితో కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ బాలీవుడ్ లో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం నాడు అయోధ్యలో జరిగింది. 

 

దీనికి చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. ప్రభాస్ తో మరో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'ఆదిపురుష్' రాబోతుంది. ఈ మూడూ కాకుండా మరో సినిమా ఓకే అయిందట. కానీ దానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీని బట్టి ప్రభాస్ బాలీవుడ్ లో మరో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

 

ప్రస్తుతానికైతే ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయింది. మరో మూడేళ్లవరకు ఆయన చాలా బిజీగా ఉంటారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో మారుతి సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ఆ తరువాత సందీప్ రెడ్డితో కలిసి 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నారు. ఇక 'ఆదిపురుష్' సినిమా విషయానికొస్తే.. సంక్రాంతి కానుకహా వచ్చే ఏడాది జనవరి 12న (Adipurush Release Date) ప్రపంచవ్యాప్తంగా  త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. 

 

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'కు ముందు, 'ఆదిపురుష్' తర్వాత అనేలా... జనవరి 12న దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి.

వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేలా...
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... హిందీ ప్రేక్షకులలో ప్రభాస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్టు దేశంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో 'ఆదిపురుష్' షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇండియా మొత్తం మీద సుమారు 9,500 స్క్రీన్లు ఉన్నాయని చెప్పాలి. అందులో ఆరున్నర వేల స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్‌లు. వాటిలో సుమారు ఎనిమిది వేల స్క్రీన్‌ల‌లో 'ఆదిపురుష్' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 'ఆదిపురుష్' రిలీజ్ డే (జనవరి 12న) 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్‌ టాక్.

'ఆదిపురుష్'ను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు.


Also Read: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!


Also Read: ప్రభాస్, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో త్రివిక్రమ్ సినిమాలు - రివీల్ చేసిన నిర్మాత!