MLA Kotamreddy:

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరులోని మహిళలకు పసుపు, కుంకుమ అందించారు. అయితే ఈ పసుపు కుంకుమకు ఓ ప్రత్యేక ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణవీ దేవి, బీహార్ లోని మంగళగౌరి దేవి అమ్మవార్ల ఆలయాలనుంచి వీటిని తెప్పించారు. వీటిని నెల్లూరులోని మహిళలకు పంచి పెట్టారు. నెల్లూరులోని రాజరాజేశ్వరి దేవస్థానంలో పసుపు కుంకుమ ప్యాకెట్లను మహిళలకు అందించారు కోటంరెడ్డి దంపతులు. 


ఆ సెంటిమెంట్ వల్లే.. 
ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. గడప గడప కార్యక్రమంలో ఇల్లిళ్లూ తిరుగుతున్న ఆయన ఓరోజు ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆయనకు గుండెనొప్పి అంటూ అక్కడే పడిపోయారు. ఆయన్ను వెంటనే నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అక్కడినుంచి హుటాహుటిన చెన్నైకి తరలించారు. చెన్నైలో పూర్తిగా కోలుకున్న కోటంరెడ్డి తిరిగి నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరుకు వచ్చిన తర్వాత తనను అంబులెన్స్ లో తీసుకెళ్లిన డ్రైవర్, ఇతర సహాయకులకు ఆయన ప్రత్యేకంగా కానుకలు ఇచ్చి సత్కరించారు. తాను ఆస్పత్రిలోకి వెళ్లేటప్పుడు ఆందోళనకు గురయ్యాయని, తిరిగి ప్రజల ముందుకు వచ్చానంటే అదంతా తన చుట్టూ ఉన్నవారి ఆదరాభిమానాలే అన్నారు శ్రీధర్ రెడ్డి. 


ఆరోజు ఏం జరిగిందంటే..?
నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రినుంచి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చెన్నైకి తరలించే క్రమంలో స్ట్రెచర్ పై ఉన్న ఆయన తన భార్య మెడలోని తాళిని పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సందర్భంలో తనకు మాంగళ్యానికున్న సెంటిమెంట్ బలంగా గుర్తిండిపోయిందని, అందుకే తాను నెల్లూరులోని ఆడపడుచులందరికీ ఇలా పసుపు - కుంకుమ పంచి పెట్టాలనుకున్నానని చెప్పారు శ్రీధర్ రెడ్డి. 




నెల్లూరులోని మహిళలంతా నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో వర్థిల్లాలంటూ దీవించారాయన. నెల్లూరు రాజరాజేశ్వరి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది భవాని మాల ధరించిన ఎమ్మెల్యే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వీఐపీ సంస్కృతిని పక్కనపెట్టి అందరూ క్యూ లైన్లోనే అమ్మవారి దర్శనానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లోనుంచి వచ్చేవారికి పసుపు-కుంకుమ ఇచ్చారు శ్రీధర్ రెడ్డి దంపతులు. 


నెల్లూరు నగర పరిధిలో భక్తులు ప్రతి రోజూ రాజరాజేశ్వరి దేవస్థానానికి తరలి వస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఇలా రాజరాజేశ్వరి దేవి సన్నిధికి రావడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా ఇక్కడ  ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వయంగా రూరల్ ఎమ్మెల్యే దంపతులు మాంగళ్య గౌరీ దేవి ఆలయం నుంచి తెచ్చిన పసుపు, కుంకుమలు భక్తులకు ఇచ్చారు. 10 వేల మంది అక్కచెల్లెళ్లకు తన స్వహస్తాలతో వాటిని అందిస్తానని చెప్పిన ఎమ్మెల్యే.. మిగతా అనుచరులకు పని చెప్పకుండా తానే స్వయంగా వాటిని మహిళలకు అందించారు. 


నెల్లూరులో వైభవంగా అమ్మవారి ఉత్సవాలు.. 
నెల్లూరు నగరంలోని పలు ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ఆలయాల్లో అమ్మవారి అలంకారాలు ఆకట్టుకుంటున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారి రూపాలను ఇక్కడ భక్తులకోసం ఏర్పాటు చేశారు.