Police Rescued Boy In Nellore District: పల్నాడు జిల్లాలోని కిడ్నాప్ అయిన ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. అమ్మమ్మ ఇంటికి వచ్చిన నిమిదేళ్ల బాలుడు రాజీవ్ సాయి చిలకలూరిపేటలో కిడ్నాప్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెతకటంతో గంటల వ్యవధిలో బాలుడ్ని గుర్తించారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఓ కారులో బాలుడ్ని వదిలి నిందితులు పరారయ్యారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పోలీసుల వివరాల ప్రకారం.. 
రాజీవ్ సాయి తండ్రి చెన్నైలో దాన్యం వ్యాపారం చేస్తుంటారు. దసరా పండుగ సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికని పల్నాడు జిల్లాకు వచ్చాడు 8 ఏళ్ల బాలుడు రాజీవ్ సాయి. చిలకలూరిపేట 13వ వార్డులో దేవాలయంలో రాజీవ్ సాయి తల్లిదండ్రులు పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో దేవాలయం వద్ద ఆడుకుంటున్న బాలుడు రాజీవ్ సాయిని కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన అనంతరం అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్..
పూజ పూర్తవుతున్న క్రమంలో వెతకగా రాజీవ్ సాయి కనిపించలేదు. బాలుడు కిడ్నాప్ అయ్యాడని, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో కిడ్నాపర్లు కోటి రూపాయలు తమకు ఇస్తే బాలుడ్ని విడిచి పెడతామని ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు నిందితులు. పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేయగా, ఇతర చెక్ పోస్టులు, స్టేషన్లకు వివరాలు, బాలుడి ఫొటో పంపించారు. ఈ క్రమంలో చిలకలూరిపేటలో కిడ్నాప్ గురైన రాజీవ్ సాయిని నెల్లూరు జిల్లా కావలి వద్ద వదిలి వెళ్లారు నిందితులు. పోలీసులు త్వరగా స్పందించి కిడ్నాపర్ల కోసం గాలించడంతో భయాందోళనకు గురైన నిందితులు బాలుడ్ని క్షేమంగా కారులోనే వదిలో పరారయ్యారని పోలీసులు తెలిపారు.


చిలకలూరిపేటకు తీసుకొస్తున్న పోలీసులు 
కావలి పోలీసులు బాలుడ్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాలుడి పేరు, తల్లిదండ్రుల వివరాలు కనుక్కుని రాజీవ్ సాయి అని నిర్ధారించుకున్నారు. పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన బాలుడు ఇతడేనని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. కావలి నుంచి బాలుడిని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు తీసుకువస్తున్నారు. బాలుడి ఆచూకీ, క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేశారని, ఇది కచ్చితంగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పండుగకని అమ్మమ్మ ఇంటికి బాలుడు రావడం, తండ్రి వ్యాపారం చేస్తుంటారని తెలిసే కిడ్నాప్ జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇటీవల నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బాలిక కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ బాలికను గొర్రెల కాపరులు రక్షించారు. సకాలంలో గొర్రెల కాపరులు అటుగా రాకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ల బారినుంచి బయటపడిన బాలిక.. వివరాలను పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.