YSRCP MLA Sucharita: మనవైపు న్యాయం ఉంటే అవతలి వారిని ప్రశ్నించడం సహజంగానే చూస్తుంటాం. కొన్నిసార్లు తప్పు తనదైనా, ప్రత్యర్థి వర్గాల్ని ప్రశ్నలు, విమర్శలతతో ఇరుకున పెట్టడం చూస్తుంటాం. అయితే సొంత పార్టీ నేతల నుంచి ప్రశ్నలు, విమర్శలు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది. తాజాగా రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు అలాంటి పరిస్థితి ఎదురైంది. అధికారం లోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఎందుకు డెవలప్ మెంట్ చేయడం లేదని సొంత పార్టీ వైఎస్సార్ సీపీ నేతలు ఆమెను నిలదీయడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో గ్రామ సచివాలయ భవనాలను వైసీపీ ఎమ్మెల్యే సుచరిత ఆదివారం ప్రారంభించిన సమయంలో ఇది జరిగింది. 


వైసీపీ వచ్చి మూడేళ్లు అయింది, ఇంకెప్పుడంటూ నిలదీత !
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇప్పటివరకూ మాకు రోడ్డు వేయలేదు. ఎప్పుడు వేస్తారో చెప్పాలంటూ అని మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ నేత సాంబయ్య నిలదీశారు. మొదటి రెండేళ్లు ఏదో ఒకటి చెబుతూ వస్తున్నామని, అయితే మూడేళ్లు గడిచినా రోడ్డు వేయడం లేదని ప్రజలు తమను అడుగుతున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే సుచరితకు తెలిపారు. తమ పార్టీ నేత సాంబయ్య ప్రశ్నకు బదులిస్తూ.. నిధులు మంజూరు చేశామని సుచరిత తెలిపారు. కానీ ఎమ్మెల్యే సుచరిత సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు కొందరు సాంబయ్యను వారించి, పరిస్థితి వివరించి ఇంటికి పంపించారు. 


నేతల మధ్య ప్రొటోకాల్ వివాదం, ఎమ్మెల్యేకు మరో తలనొప్పి !
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో ఇటీవల నిర్మించిన 2 గ్రామ సచివాలయ భవనాలను వైసీపీ ఎమ్మెల్యే సుచరిత ఆదివారం ప్రారంభించారు. అయితే ఆ శిలాఫలకాలపై డిప్యూటీ ఎంపీపీ ఆఫ్రిన్‌ సుల్తానా పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచి లాం రత్నకుమార్‌ పేరును చివర్లో రాయడంతో ఇబ్బందిగా ఫీలయ్యారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, విషయాన్ని ఎమ్మెల్యే సుచరిత దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె డీఈ రమేశ్‌బాబును దీనిపై ప్రశ్నించారు. ఏ కార్యక్రమంలోనైనా ప్రొటోకాల్‌ ప్రకారమే పేర్లు ఉండాలని సూచించారు. స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో శిలాఫలాకల విషయంపై కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది.