తమిళ చిత్రసీమలో యువ అగ్ర కథానాయకులలో ఒకరు, తెలుగు పేక్షకులకు కూడా సుపరిచితుడైన ధనుష్ (Dhanush) నటించిన తాజా సినిమా 'నానే వరువెన్' (Naane Varuven Movie). దీనికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'నేనే వస్తున్నా' (Nene Vasthunna Movie) పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.


Oke Oka Oorilona Lyrical : 'నేనే వస్తున్నా' సినిమాలోని 'ఒకే ఒక ఊరిలోనా... రాజులు ఏమో ఇద్దరంటా' పాటను ఈ రోజు విడుదల చేశారు.  


'ఒకే ఒక ఊరిలోనా...
రాజులు ఏమో ఇద్దరంటా!
ఒక్కడేమో మంచోడంట...
ఇంకోడేమో చెడ్డోడంట!
చిక్కని చీకటి లేకుంటే... 
చంద్రుని వెలుగే తెలియదులే!
రక్కసుడు ఒక్కడు లేకుంటే...
దేవుని విలువే తెలియదులే!  
పాముల్లోనా విషముంది...

పువ్వులోని విషముంది...
పూలను తల్లో పెడతారే!
పామును చూస్తే కొడతారే!
మనిషిలో మృగమే దాగుంది... 
మృగములో మానవత ఉంటుంది!'


అంటూ చంద్రబోస్ ఈ పాటను రాశారు. ఆయన సాహిత్యంలో లోతైన భావం దాగుంది. సమాజాన్ని ప్రశ్నించడంతో పాటు కథలో ఆత్మను ఆవిష్కరించేలా ఆయన పాట రాశారు. 'నేనే వస్తున్నా' సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ రెండు కోణాలను ఆవిష్కరించేలా చంద్రబోస్ పాట రాశారు. దీనిని ఎస్.పి. అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 



ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై 'కలైపులి' ఎస్. థాను నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. సెప్టెంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


Also Read : గన్స్‌తో సుధీర్ బాబు చెప్పే నిజం ఏమిటి? సెప్టెంబర్ 28న టీజర్ చూడండి


అన్నదమ్ముల కాంబినేషన్‌లో నాలుగో సినిమా!
తమ్ముడు ధనుష్ కథానాయకుడిగా 'కాదల్ కొండేన్', 'పుదు పేట్టై', 'మయక్కం ఎన్న' - మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు సెల్వ రాఘవన్. అన్నదమ్ముల కాంబినేషన్‌లో నాలుగో చిత్రమిది. విశేషం ఏమిటంటే... ఈ సినిమాకు ఇద్దరూ కలిసి కథ రాశారు. తొలుత 'పుదు పేట్టై 2' చేయాలనుకున్నా... తర్వాత ఆ ఆలోచన పక్కన పెట్టేసి, ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. గీతా ఆర్ట్స్ ద్వారా సినిమా విడుదల అవుతుండటం తనకు గర్వంగా ఉందని సెల్వ రాఘవన్ తెలిపారు. 


'పొన్నియన్ సెల్వన్'కు పోటీగా...  
సెప్టెంబర్ 30న మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్ సెల్వన్' విడుదల కానుంది. అందులో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, ఆర్ పార్తీబన్, జయరామ్ తదితరులు నటించారు. దాని కంటే ఒక్క రోజు ముందు 'నేనే వస్తున్నా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో భారీ తారాగణం ఉన్న సరే... ధనుష్ ఎక్కడా 'తగ్గదే లే' అన్నట్లు తన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీని ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 


Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ