మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ధమాకా' (Dhamaka Movie). డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. ఇదొక మాస్ సినిమా. ఇంకా చెప్పాలంటే... మాస్ మహారాజ్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారో? ఆ అంశాలు అన్నీ ఉన్న సినిమా! అందుకని, మొదటి రోజు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రేక్షకుల నుంచి మాత్రం సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. థియేటర్లలో 'ధమాకా' దుమ్ము రేపుతోంది. భారీ వసూళ్ళు సాధిస్తోంది.


ధమాకా @ 40 క్రోర్స్ ప్లస్!
థియేటర్ల నుంచి 'ధమాకా' తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. మొదటి రోజు, రెండో రోజు కంటే మూడో రోజు థియేటర్లలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, 'ధమాకా' అలా కాదు... నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. 


తొమ్మిది కోట్లు అంటే మాటలు కాదు!
మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'ధమాకా'... నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. అంటే... నాలుగో రోజు తొమ్మిది కోట్లు వచ్చాయి అన్నమాట. ఈ నంబర్  సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి.


'ధమాకా'కు ముందు ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఈ ఏడాది రవితేజకు విజయం వస్తుందా? లేదా? 'ధమాకా' వసూళ్ళు రవితేజ పరీక్ష పెడతాయి? వంటి మాటలు విడుదలకు ముందు వినిపించాయి. అయితే, ఆ అనుమానాలు అన్నిటినీ మాస్ మహారాజ్ పటాపంచలు చేశారు. ఆయన కెరీర్‌లో 'ధమాకా' బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.


Also Read : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా


'ధమాకా' సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ నెలకొంది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లోకి వెళ్ళాయి. మాస్ మహారాజ్ రవితేజ కూడా జోరుగా ప్రచారం చేశారు. దాంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. కామెడీ అండ్ కంటెంట్ ఉండటంతో పాటు క్రిస్మస్ సెలవులు కూడా కలిసి వచ్చాయి. సినిమా సూపర్ డూపర్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది.  


Also Read : ఐదు భాషల్లో హీరోగా అంకిత్ తొలి సినిమా 'జాన్ సే' - ఈ అబ్బాయిని గుర్తు పట్టారా?






'ఇంద్ర' స్పూఫ్ సూపర్!
'ధమాకా' సినిమా విడుదలకు ముందు యూనిట్ సభ్యులు ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అని చెబుతూ వస్తున్నారు. రౌడీ అల్లుడు తరహాలో ఉంటుందనే మాటలు కూడా వినిపించాయి. థియేటర్ల నుంచి వచ్చిన ప్రేక్షకులు కూడా కామెడీ గురించి మాట్లాడారు. 'ఇంద్ర' స్పూఫ్ థియేటర్లలో సూపర్ ఉందని కామెంట్లు వినబడుతున్నాయి. దాంతో సినిమా పాస్ అయిపొయింది. కామెడీకి తోడు రవితేజతో హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఎంటర్‌టైన్ చేశాయి. 


త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన 'ధమాకా'కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ఈ సినిమాకు 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది. 


మళ్ళీ మూడు సినిమాలతో... 2023లో!
ఈ ఏడాది రవితేజ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఆయన నుంచి మూడు సినిమాలు రావడం ఖాయంగా కనబడుతోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'ఈగల్' టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.