తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, యావత్  భారతీయ సినిమా పరిశ్రమలోనే ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఒకానొక సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రాజమౌళి అనే రేంజిలో క్రేజ్  లభించింది.  ‘బాహుబలి’తో పాటు ‘బాహుబలి-2’ సైతం కనీవినీ ఎరుగని రీతిలో విజయాలు అందుకున్నాయి. టెక్నికల్ వ్యాల్యూస్ పరంగానే కాకుండా వసూళ్ల విషయంలోనూ ఎన్నో సంచలనాలను నమోదు చేశాయి. ఇక ‘బాహుబలి-2’ సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన సీన్.. మాహిష్మతి సభలో బాహుబలి సైన్యాధిపతి సేతుపతి తల నరికే దృశ్యం. ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఈ సీన్ ను ప్రపంచవ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ఉన్నది ఉన్నట్లుగా దించేశారు.


గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లో బాహుబలి-2 సీన్


సినిమాలు, వెబ్ సిరీస్ చూసే వారికి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎనిమిది సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్ ప్రపంచంలోనే టాప్ రేటెడ్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచింది.. చివరి రెండు సీజన్లు నిరాశ పరచకపోయి ఉంటే ప్రపంచంలోనే నంబర్ వన్ వెబ్ సిరీస్ గా నిలిచేది. దర్శక ధీరుడు రాజమౌళి ఫేవరెట్ వెబ్ సిరీస్ కూడా ఇదే. తన చిత్రాల్లో అక్కడక్కడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి కూడా. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ అనే వెబ్ సిరీస్‌ను హెచ్‌బీవో రూపొందించింది. అందులో భాగంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో టెలీకాస్ట్ అయిన తాజా ఎపిసోడ్ లో ఓ సీన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘బాహుబలి-2’లోని సేతుపతి తల నరికే సీన్ మక్కీకి మక్కీ దించేశారు. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్ లో భాగంగా 8వ ఎపిసోడ్ లో ఈ సీన్ కనిపించింది. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈ ఎపిసోడ్ ను తెరకెక్కించిన దర్శకురాలు గీత వసంత్ పటేల్ భారతీయ సంతతికి చెందిన మహిళ.


ఇంతకీ ఎవరీ గీత వసంత్ పటేల్?


గీతా తన కెరీర్‌ను భారీ బడ్జెట్  చిత్రాలలో అసోసియేట్ స్క్రీన్‌రైటర్‌గా ప్రారంభించింది. ఆమె డిస్నీ, యూనివర్సల్ పిక్చర్స్, ABC, NBC, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్‌లతో కలిసి ‘ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్’, ‘బ్లూ క్రష్‌’తో సహా అనేక చిత్రాలలో పని చేసింది. ‘మీట్ ది పటేల్స్’ చిత్రానికిగాను గీతా, ఆమె సోదరుడు రవి వసంత్ పటేల్ ఎమ్మీకి నామినేట్ అయ్యారు. ఈ చిత్రం 2015లో థియేట్రికల్‌గా ప్రదర్శించబడింది మరియు అకాడమీ అవార్డు విజేత గెరాలిన్ డ్రేఫౌస్ ఎగ్జిక్యూటివ్‌గా నిర్మించారు. గీత తన సోదరుడితో కలిసి సినిమాటోగ్రాఫర్‌గా, రచయితగా, నిర్మాతగా, ఎడిటర్‌గా, దర్శకురాలిగా పనిచేసింది. గీత.. సన్‌డాన్స్/ITVS చిత్రం ‘ప్రాజెక్ట్ కాశ్మీర్‌’తో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. టెలివిజన్‌లో  ‘సూపర్‌ స్టోర్’, ‘ది గ్రేట్’తో పాటు ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌’ సహా పలు సిరీస్ లకు దర్శకత్వం వహించింది. 


ఆ సీన్‌ను ఇక్కడ చూడండి: 


Read Also:  ‘కాంతరా’పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు, అవన్నీ దిగదుడుపేనంటూ ట్వీట్! 


Note: సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న సీన్‌ను ఇక్కడ యథావిధిగా ఎంబెడ్ చేశాం. ఆ వీడియోలో కంటెంట్, ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.