KTR :  తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరుతందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణాన్ని సాగిస్తున్నామని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్‌ సహా ఐదు ప్రాజెక్టులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. అనేక కొత్త కంపెనీలు రావడంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ విస్తరణను చేపట్టాయని పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్ రంగంలో పెట్టుబడులతో దేశంలోనే జీనోమ్ వ్యాలీ కీలకంగా ఎదిగిందని మంత్రి స్పష్టం చేశారు. జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకమైందన్నారు. జీవ ఔషధ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.



ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, కంపెనీల విస్తరణతో రానున్న రోజుల్లో 20లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల స్పేస్‌ అదనంగా తోడవుతుందన్నారు. రూ. 1100కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ఐదు ప్రాజక్టుల ద్వారా మూడువేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ఆయన చెప్పారు.దేశంలోని అన్ని క్లస్టర్లలో ఉన్న ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యంకన్నా ఎక్కువ ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యం జీనోమ్‌ వ్యాలీలో ఉన్నదని, ఇంకా విస్తరిస్తున్నామన్నారు. 





మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ అనుకూల విధానాలు, నాణ్యమైన వర్క్‌ఫోర్స్‌, ఓవర్‌ ఆల్‌ ఇకోసిస్టం తదితర అంశాలు జీనోమ్‌ వ్యాలీని అత్యంత ఆకర్షణీయ లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌గా తీర్చిదిద్దిందన్నారు. సీఆర్‌ఓలు, సీడీఎంఓలు ఉన్నాయని, సింజీన్‌, లారస్‌, క్యూరియా తదితర అనేక సీఆర్‌ఓలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని, కోవిడ్‌ వ్యాప్తిస్తున్న సమయంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో అత్యంత కీలకపాత్ర పోషించిందని కేటీఆర్ తెలిపారు.