రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న సినిమా 'శశివదనే'. గోదావరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రమిది. నందు, అవికా గోర్ జంటగా నటించిన తాజా సినిమా 'అగ్లీ స్టోరీ'. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలకు ఓ కనెక్షన్ ఉంది. అది ఏమిటంటే... విజయనగరం కుర్రాడు శ్రీ సాయి కుమార్ దారా రెండిటికీ సినిమాటోగ్రాఫర్.


'శశివదనే', 'అగ్లీ స్టోరీ' చిత్రాల కంటే ముందు 'ది ట్రయిల్' సినిమా చేశారు శ్రీ సాయి కుమార్ దారా. ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. అయితే సరైన విడుదల తేదీ లభించకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు 'అగ్లీ స్టోరీ' సినిమాపై శ్రీ సాయి కుమార్ దారా ఆశలు పెట్టుకున్నారు. అసలు, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? ఇంతకు ముందు ఎవరి దగ్గర పని చేశారు? వంటి విషయాలు ఆయన మాటల్లో... 


ఏడేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చాను
''మాది విజయనగరం. మా ఇంట్లో ప్రతికూల పరిస్థితులు నన్ను ప్రకృతికి దగ్గర చేశాయి. చిన్నప్పుడు అమ్మ నాన్న దూరం కావడంతో ప్రకృతిలో ఆ ప్రేమ, ఆప్యాయతలు చూసుకున్నా. ప్రకృతి అందాలను కెమెరా కంటితో క్లిక్ చేయడం స్టార్ట్ చేశా. సరిగ్గా ఏడేళ్ల క్రితం... 2016లో పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ వచ్చా. కెమెరా విభాగంలో ఎలా చేరాలో తెలియలేదు. షార్ట్ ఫిల్మ్స్ కు పని చేస్తూ ఫోకస్ పుల్లర్ నాగేశ్వరరావు దేవరకొండ దృష్టిలో పడ్డాను. ఆయన పరిచయం నా జాతకాన్ని మార్చింది. ఆయన అండతో 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దగ్గర సహాయకుడిగా చేరాను'' అని చెప్పారు.  


'రంగస్థలం', 'సైరా' చిత్రాలకు పని చేశా
''కృష్ణగాడి వీర ప్రేమ గాథ' తర్వాత యువరాజ్ గురువు దేవరాజ్ దగ్గర 'ఈడు గోల్డ్ ఎహే' చిత్రానికి పని చేశా. ఆ తర్వాత రత్నవేలు గారి దగ్గర 'రంగస్థలం', 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాలకు పని చేశా. ఆ తర్వాత కెమెరా విభాగంలో మరింత ప్రావీణ్యం సాధించాలన్న ఆకాంక్షతో సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ నెలకొల్పిన 'మైండ్ స్క్రీన్' సినిమాటోగ్రఫీ ఇన్స్టిట్యూట్ లో చేరి ట్రైనింగ్ తీసుకున్నా'' అని సాయి కుమార్ చెప్పారు.


Also Readముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు


ట్రయిల్ తర్వాత శశివదనే, అగ్లీ స్టోరీ
''ఛాయాగ్రాహకుడిగా నాకు మొదటి అవకాశం 'శశివదనే' రూపంలో వచ్చింది. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న ఆ సినిమా సెట్స్ మీద ఉండగా... 'ది ట్రయల్'కు పని చేసే అవకాశం వచ్చింది. ముందు ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత 'అగ్లీ స్టోరీ'కి పని చేశా. ఈ రెండు సినిమాలు త్వరలో విడుదలకు రెడీ అవుతున్నాయి. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో శత్రు, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాకు కూడా కమిట్ అయ్యాను. విజయనగరం నుంచి హైదరాబాద్ రావడానికి, ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారకులయిన పంతులు గారు ఏడిద మల్లేశ్వర శర్మతో పాటు నాగేశ్వరావు దేవరకొండ, యువరాజ్, దేవరాజ్, రత్నవేలుకు ఎప్పటికీ రుణపడి ఉంటా'' అని చెప్పారు సాయి కుమార్ దారా.


Also Readబన్నీ పాట మహేష్‌కు... కుర్చీ మడతపెట్టి కాపీయే