Senior actress playing a key role in Nithiin’s Thammudu Movie : లవర్ బాయ్ నితిన్ హీరోగా వకీల్ సాబ్ మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నితిన్ తో ఫస్ట్ టైం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలన్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నితిన్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అందిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమాలో భారీ కాస్ట్‌ను భాగం చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది.


నితిన్‌కు అక్కగా సీనియర్ హీరోయిన్


'తమ్ముడు' మూవీ చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ని హైలెట్ చేయబోతున్నారట వేణు శ్రీరామ్. అక్క జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ల నుంచి రక్షించేందుకు ఎంతకైనా తెగించే తమ్ముడి కథే ఈ సినిమా అని సమాచారం. సినిమాలో హీరో నితిన్ పాత్రకి సమానంగా ఇందులో సిస్టర్ క్యారెక్టర్ ఉండబోతోంది. ఈ క్యారెక్టర్ కోసం ఎంతోమందిని పరిశీలించిన మూవీ టీం చివరికి ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ లయను ఫైనల్ చేసినట్లు సమాచారం. తమ్ముడు సినిమాలో లయ నితిన్ కి అక్కగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. లయ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అవుతుంది. చివరగా ఆమె 2018లో విడుదలైన రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది.


ఆరేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరపై..


ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకున్న లయ హీరోయిన్ గా1 చివరగా 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం అమెరికాలో సెటిలై అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం  చేసింది. 2018 లో 'అమర్ అక్బర్ ఆంథోనీ' సినిమాలో నటించగా.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మళ్ళీ సినిమాల్లో నటించలేదు. ఈ మధ్యకాలంలో అమెరిక నుంచి హైదరాబాద్ వచ్చిన లయ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఎట్టకేలకు నితిన్ 'తమ్ముడు' సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.


అమెజాన్ చేతికి ఓటీటీ రైట్స్


నితిన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'తమ్ముడు' సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఓటీటీ డీల్ ని క్లోజ్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని అమెజాన్ సంస్థ తాజాగా ముంబై లో జరిగిన ఈవెంట్ లో అధికారికంగా వెల్లడిస్తూ తమ్ముడు ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసింది  దాంతో పాటూ ఈ సినిమాలో లయ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేశారు. కాగా తమ్ముడు ఓటీటీ రైట్స్ కోసం ఆమెజాన్ భారీగానే చెల్లించినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన 'కాంతారా' మూవీ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ కీ రోల్ ప్లే చేస్తుంది.


Also Read : 'పుష్ప' టీమ్‌కి తప్పని లీకుల బెడద - సెట్స్ నుంచి లీకైన రష్మిక లుక్!