దర్శక దిగ్గజం ఎస్, ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర సమరయోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకోవడం తోపాటు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ని అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.


ముఖ్యంగా హాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం ఈ సినిమాను చూసి మంత్రముగ్ధులు అయిపోయారు. అలా హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా 'ఆర్ ఆర్ ఆర్' కి సీక్వెల్ ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ 'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ ఓ పరిణితి చెందిన వ్యక్తి అని.. కష్టం, సుఖం, లాభం, నష్టం అన్ని చూసేసిన ఓ నిండుకుండలాంటి వ్యక్తిత్వాన్ని ఎన్టీఆర్‌లో తాను చూసానని చెప్పారు. అంతేకాకుండా ఎన్టీఆర్ చాలా బ్యాలెన్స్ గా ఉంటారని అన్నారు.


మళ్లీ మీ కాంబినేషన్లో(రాజమౌళి - ఎన్టీఆర్) సినిమా ఎప్పుడు ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'RRR' కి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తెలియదని, కానీ 'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ విషయంలో రాజమౌళికి చాలా ప్లాన్స్ ఉన్నాయని, RRR సీక్వెల్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ పై విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఈయన కామెంట్స్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు.


రాజమౌళి ప్రస్తుతం సూపర్ సార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అడ్వెంచర్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ సుమారు రూ.600 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రాజెక్టు కోసం రాజమౌళి హాలీవుడ్ మేకర్స్ తో చేతులు కలిపారు. ఇక ఈ సినిమాని రాజమౌళి పలు భాగాలుగా తీస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


Also Read : తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తమ సత్తా చాటుతారు: బాలకృష్ణ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial