‘లైగర్’ సినిమా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రామ్ పోతినేనితో కొత్త సినిమా షురూ చేశారు. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే పూరి ఓ ప్రకటన చేయగా, తాజాగా అధికారికంగా లాంచ్ చేశారు.
పూజా కార్యక్రమంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ లాంచ్
ఈ రోజు కోర్ టీమ్ తో పాటు కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఛార్మి క్లాప్ కొట్టగా, హీరో రామ్ పోతినేనిపై పూరి జగన్నాథ్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుందని పూరీ ప్రకటించారు. ఈ చిత్రం డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. "డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! మేము తిరిగి వచ్చాం!! #డబుల్‌ఇస్మార్ట్ మోడ్ ఆన్!" అంటూ మూవీ లాంచింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలను హీరో రామ్ షేర్ చేశారు.
శివరాత్రి కానుకగా ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న విడుదల కానుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రామ్‌తో పాటు పూరీ జగన్నాథ్‌కి చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా హీరోకి, దర్శకుడికి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ను అందించింది. ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘ది వారియర్’ మూవీ తర్వాత రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. రామ్ చివరి సినిమా ‘ది వారియర్’కు లింగుసామి దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమాను కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక పూరీ చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే పాన్ ఇండియన్ మూవీ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.
Read Also: ‘జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial