తెలుగు సినీ ఇండస్ట్రీలో 'బాహుబలి' 'ఆర్ ఆర్ ఆర్' వంటి సినిమాలతో దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ఎస్.ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆయన ఏ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినా, ముందుగా కథపైనే ఎంతో కసరత్తు చేస్తారు. ముఖ్యంగా కథకు తాను విజువల్ గా అనుకున్న రూపం వచ్చేంతవరకు ఆ కథను చెక్కుతూనే ఉంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకు 'జక్కన్న' అని పేరు పెట్టారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో 'ఆర్.ఆర్.ఆర్' అనే భారీ మల్టీస్టారర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


ఈసారి మహేష్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రాజెక్టుని ప్లాన్ చేశారు రాజమౌళి. అంతేకాదు మహేష్ - రాజమౌళి కాంబోలో రాబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కథను ప్రిపేర్ చేస్తున్నారు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్. రాజమౌళి తెరకెక్కించే సినిమాలకి అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ మహేష్ మూవీ స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా తీయబోతున్నట్లు ఇప్పటికే చెప్పడం జరిగింది.


ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'పై తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రచయిత విజేంద్ర ప్రసాద్. భారతీయ ఇతిహాస గాధ మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలని రాజమౌళి ఎంతోకాలంగా అనుకుంటున్నారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. ఒకవేళ మహాభారతాన్ని తాను తెరకెక్కిస్తే దాన్ని పది భాగాలుగా రూపొందించాలని ఉందంటూ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా రాజమౌళి స్పష్టం చేశారు. అయితే ఈ మహాభారతాన్ని ఓ అద్భుత దృశ్య కావ్యంగా రాజమౌళి ఏ విధంగా తెరకెక్కిస్తారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. కానీ మహాభారతాన్ని రాజమౌళి ఎప్పుడు తెరకెక్కిస్తారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.


తాజాగా రచయిత విజయేంద్రప్రసాద్ ఇదే విషయమై క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు విజయేంద్రప్రసాద్. ఈ మేరకు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు 'మహాభారతం' మహేష్ బాబు సినిమా తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు చాలా బిగ్ స్కేల్ లో ఉంటుందని, దీనిపై రాజమౌళి మైండ్ లో ఎన్నో ప్లాన్స్  ఉన్నాయని చెప్పారు. ఇక మహేష్ మూవీ గురించి కూడా అప్డేట్ ఇస్తూ.. ఇది ఒక అడ్వెంచర్స్ మూవీ అని, అంతేకాకుండా 'ఆర్.ఆర్.ఆర్'ని మించి ఎవరు ఊహించని విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.


Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోన్న ‘సలార్’ పార్ట్ 2, అదే జరిగితే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial