Taapsee Pannu About Animal Movie: తాప్సీ పన్ను. ‘ఝుమ్మంది నాదం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలోనూ సత్తా చాటింది. నెమ్మదిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తాప్సీ పన్ను ‘యానిమల్‘ మూవీని టార్గెట్ చేసింది.


రష్మికపై పరోక్ష విమర్శలు చేసిన తాప్సీ


బాలీవుడ్‌ స్టార్ హీరో రణబీర్‌ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు గా  నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'యానిమల్‌'. సందీప్‌ రెండ్డి వంగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రి-కొడుకు మధ్య సెంటిమెంట్ బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ వేదికగా ‘యానిమల్‘ మూవీపై చర్చ జరిగింది.  


కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ‘యానిమల్‘ కంటెంట్ చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు నటులు, చిత్ర ప్రముఖులు సైతం యానిమల్ కి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈ లిస్ట్ లో తాజాగా హీరోయిన్ తాప్సీ చేరింది. తానైతే ‘యానిమల్‘ మూవీలో నటించనని పరోక్షంగా రష్మిక మందన్నకు చురకలు అంటించింది. “సినిమా నటులకు ఒక పవర్ ఉంటుంది. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. అలా అని ‘యానిమల్’ లాంటి సినిమాల్లో నటించేవాళ్ళను నేను తప్పుబట్టడం లేదు. మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం.  నచ్చింది చేసే స్వేచ్ఛ మనకు ఉంది. నేనైతే ‘యానిమల్’ మూవీలో నటించను” అని తేల్చి చెప్పింది.


‘యానిమ‌ల్’ మూవీలో బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించగా, రణబీర్‌ క‌పూర్ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టించాడు. త్రిప్తి దిమ్రీ మరో కీలకపాత్రలో కనిపించింది. ఈ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందించారు. టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో క‌లిసి సందీప్ వంగా సోద‌రుడు ప్ర‌ణ‌య్ వంగా ఈ మూవీని నిర్మించారు. ‘యానిమ‌ల్’ మూవీ త‌ర్వాత ప్ర‌భాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయ‌బోతున్నారు సందీప్ వంగా.


‘డంకీ’ సినిమాలో కనిపించిన తాప్సీ


అటు తాప్సీ రీసెంట్ గా  షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ తో కలిసి ‘డంకీ’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అంటారు.  భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథతో రాజ్‌కుమార్‌ హిరానీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో విక్కీ కౌశల్‌, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 21న విడుదలై విజయాన్ని అందుకుంది. 


Read Also: ‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం? వినాయక చవితికి కూడా విడుదల కానట్టేనా?