Game Changer Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత చెర్రీ చేస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా, రిలీజ్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.


‘గేమ్ ఛేంజర్’ విడుదల మరింత ఆలస్యం!


కొద్ది వారాల క్రితం ‘సలార్’ సినిమా చూసేందుకు వచ్చిన నిర్మాత దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ 2024లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వినాయక చవితి కానుగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆ డేట్ కు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘OG’ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ పై వారి నుంచి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


తీవ్ర నిరాశలో చెర్రీ అభిమానులు


వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు  ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ లోనూ బిజీ అయ్యారు. రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కించడంతో ‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. ‘RRR’ విడుదల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న’దేవర’ మూవీ తొలి భాగం ఏప్రిల్ 5న విడుదలకు రెడీ అవుతున్నా, ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఇప్పటికే ఏ క్లారిటీ రాకపోవడంపై చెర్రీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.  


‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు కథను అందించారు. పొలిటికల్‌, యాక్షన్‌ కథతో ‘గేమ్‌ ఛేంజర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Read Also: అలిపిరిలో ఆగిపోయిన ధనుష్ మూవీ షూటింగ్, అనుమతులు రద్దు - అసలు ఏం జరిగింది ?