NTR In War 2: ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఎన్‌టీఆర్. అంతకు ముందు కూడా ఎన్‌టీఆర్ నటించే సినిమాలను నార్త్ ప్రేక్షకులు ఆదరించేవారు. కానీ ఇప్పుడు ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్‌లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తను నేరుగా హిందీ సినిమాలో నటిస్తే చూడాలని అక్కడి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్న ‘వార్ 2’ మూవీలో ఎన్‌టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడనే వార్త బయటికొచ్చింది. అది నిజం కాదు అని కొందరు భావిస్తున్నా.. అప్పుడప్పుడు ‘వార్ 2’ ప్రస్తావనలో ఎన్‌టీఆర్ పేరు కూడా వినిపిస్తూనే ఉంది. తాజాగా హృతిక్ రోషన్ సైతం ఈ విషయంపై స్పందించాడు.


‘వార్ 2’పై కీలక అప్డేట్..


సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వార్’.. యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని వీరిద్దరూ ముందే ఫిక్స్ అయ్యారు. కానీ ఇంతలోనే మధ్యలోకి ‘ఫైటర్’ అనే ప్రాజెక్ట్ వచ్చింది. దీంతో సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కలిసి తమ పూర్తి ఫోకస్ ఈ మూవీపై పెట్టారు. తాజాగా ‘ఫైటర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో, మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా సక్సెస్‌పై స్పందిస్తూ ప్రేక్షకులతో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు హృతిక్. ఆ క్రమంలోనే ‘వార్ 2’ గురించి అప్డేట్‌ను కూడా అందించాడు.


త్వరలోనే సెట్స్‌పైకి..


సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ‘ఫైటర్’లో షంషేర్ పథానియా అలియాస్ పాటీ అనే పాత్రలో కనిపించాడు హృతిక్ రోషన్. ఈ సినిమా సక్సెస్ ప్రమోషన్స్‌లో ‘వార్ 2’ గురించి మాట్లాడాడు. ‘‘అది త్వరలోనే ప్రారంభం కానుందని మాత్రమే చెప్పగలను. అతి త్వరలోనే వార్ 2 సెట్స్‌పైకి వెళ్లనుంది. నాకు అసలు తీరిక లేదు’’ అని చెప్పుకొచ్చాడు హృతిక్. ‘‘మిమ్మల్ని, జూనియర్ ఎన్‌టీఆర్‌ను ఒక ఫ్రేమ్‌లో చూడడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని జర్నలిస్ట్ చెప్పగా.. ‘‘అవును. ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అంటూ హృతిక్ ఒప్పుకున్నాడు. దీంతో ‘వార్ 2’లో ఎన్‌టీఆర్ ఉండడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఫిబ్రవరి నెలలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. అయితే, ‘దేవర’ షూటింగ్ షెడ్యూల్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. రెండు సినిమాల్లో ఎన్టీఆర్ భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ‘వార్ 2’ కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ మార్చుకోవల్సి ఉంటుందని సమాచారం.


‘దేవర’ తర్వాత..


2019లో విడుదలయిన ‘వార్’ కూడా మల్టీ స్టారర్‌గానే తెరకెక్కింది. అందులో హృతిక్ రోషన్‌తో పాటు మరో హీరోగా టైగర్ ష్రాఫ్ నటించాడు. ఇప్పుడు ‘వార్ 2’లో హృతిక్‌తో పాటు ఎన్‌టీఆర్ తలపడనున్నాడు. ఇక బాలీవుడ్‌లోకి మొదటిసారి ఎంట్రీ ఇస్తూ.. మల్టీ స్టారర్‌ సినిమాను ఎంచుకోవడం కరెక్ట్ కాదేమో అని కొందరు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్ ఆన్ స్క్రీన్ తలపడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘వార్’ను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ దాని సీక్వెల్ నుండి తప్పుకున్నాడు. దీంతో ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ చేతికి ‘వార్ 2’ ప్రాజెక్ట్ వెళ్లింది. ప్రస్తుతం ఎన్‌టీఆర్ ‘దేవర’ సినిమాలో బిజీగా ఉండగా.. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘వార్ 2’ సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని అర్థమవుతోంది.


Also Read: బ్లాక్‌ ఫారెస్ట్‌లో మహేష్ బాబు ట్రెక్కింగ్ - ఈ భయానక అడవి ప్రత్యేకతలు ఇవే!