మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నడుస్తూ, మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అర డజను మంది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 'మెగా' బ్రాండ్ తో వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి.. పరిశ్రమలో నిలదొక్కుకోడానికి తీవ్రంగా కష్టపడుతూ వస్తున్నారు. వారిలో కొందరు ఇప్పటికే స‌క్సెస్‌ ఫుల్‌ కెరీర్‌ ను కొన‌సాగిస్తున్నారు. అయితే మేనమామల అండదండలతో వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధ‌ర‌మ్‌ తేజ్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదనే చెప్పాలి. 


'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్‌ తేజ్.. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్', 'చిత్ర లహరి', 'ప్రతిరోజూ పండుగే' వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే తేజ్ కు కొంత‌కాలంగా స‌రైన హిట్టు ప‌డ‌లేదు. 'సోలో బ్రతుకు సో బెటర్' సినిమా నిరాశ పరచగా, బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత విడుద‌లైన‌ 'రిప‌బ్లిక్' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో యువ హీరో ఇప్పుడు క‌మ్ బ్యాక్‌ ఎంట్రీలో మంచి స‌క్సెస్ అందుకోవాల‌ని చూస్తున్నాడు. 


ఇందులో భాగంగా ముందుగా 'విరూపాక్ష’ అనే ఆసక్తికరమైన మిస్టిక్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు సాయి తేజ్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


ఈ క్రమంలో తాజాగా సాయి తేజ్ మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈసారి ఏకంగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం అందుకున్నాడు. 'వినోద‌య సీత‌మ్' అనే తమిళ రీమేక్ లో మామా అల్లుళ్ళు తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈరోజు బుధవారం #PKSDT పేరుతో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ని అధికారంగా ప్రకటించి, షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రముఖ నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించ‌నున్నారని టాక్. 


'వినోదయ సీతం' సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా కొన్నాళ్ళు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబడింది. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తుండటం గమనార్హం. మాతృకలో స‌ముద్ర ఖ‌ని - తంబి రామ‌స్వామి పోషించిన పాత్రల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించనున్నారు. పవన్ ఇందులో ఒక మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. దీని కోసం ఆయన కేవలం 20 రోజులు మాత్రమే కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. 


ఏదేమైనా మెగా మామా అల్లుళ్ళు ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అందులోనూ గత కొంతకాలంగా స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్, తన మామ సపోర్ట్ తో సాలిడ్ హిట్ కొడతాడని భావిస్తున్నారు. మరి #PKSDT సినిమాతో తేజ్ బ్లాక్ బస్టర్ అందుకొని, కెరీర్ ని గాడిలో పెట్టుకుంటాడేమో చూడాలి.



Read Also: వామ్మో! ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?