నందమూరి తారకరత్న గుండెపోటుతో చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు. ఫిబ్రవరి 18న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. సుమారు 23 రోజుల పాటు చావుతో పోరాడి ఓడిపోయారు. కుటుంబ సభ్యుల అశృనయనాలు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నివాళుల నడుమ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి.


‘Project K’లో కీలకపాత్రకు తారకరత్న అంగీకారం


అంత్యక్రియల అనంతరం స్మశానవాటికలో జరిగిన కార్యక్రమాల సందర్భంగా ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ అక్కడికి వెళ్లారు. తారకరత్నకు చితా భస్మానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారకరత్నకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు. తమ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ ‘Project K’లో ఆయన కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఈ పాత్ర చేసేందుకు ఆయన కూడా ఓకే చెప్పినట్లు తెలిపారు. ఇంతలోనే దురదృష్టం వెంటాడిందన్నారు. అంతేకాదు, తారకరత్నతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అశ్వనీదత్ పంచుకున్నారు. 2002లో తారకత్న తొలి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ను తానే నిర్మించినట్లు వెల్లడించారు. ఆయనను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేసే అవకాశం తనకే దక్కిందన్నారు. అటు మహాప్రస్థానంలో జరిగిన తారకరత్న అంత్యక్రియలకు హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కీలక విషయాన్ని చెప్పారు. NBK108 సినిమాలో తారకరత్న ఓ క్యారెక్టర్ చేయాల్సి ఉందన్నారు. అనుకోని ఘటనతో ఆయన కన్నుమూశారని వెల్లడించారు. ఆయన మరణం చాలా దురదృష్టకరమని చెప్పారు.   


జనవరి 27న తారకరత్నకు గుండెపోటు


టీడీపీ నేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన..  గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనం మధ్యలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే తారకరత్నను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మరింత విషమించడంతో అదే రోజు రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు అరగంట పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. విదేశీ వైద్య బృందం సైతం ఆయన ప్రాణాలు కాపాడేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. అయినా, కాపాడలేకపోయారు. 23 రోజుల చికిత్స అనంతం శనివారం రాత్రి  తారకరత్న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.


భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ ‘Project K’


ఇక ‘Project K’లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ మూవీలో  బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిషా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12, 2024న ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.   


Read Also: వామ్మో! ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?