తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ సత్తా చాటుతున్న తరుణంలో మన హీరోల మార్కెట్ కూడా అందుకు తగ్గట్టుగానే పెరిగిపోతోంది. ఒకప్పుడు సౌత్ చిత్రాలు 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంటే గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అవలీలగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్నాయి. అందుకే వంద, రెండు వందల కోట్లు అనేది మినిమమ్ బెంచ్ మార్క్ గా మారిపోయాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ క్లబ్ లో చేరిపోయారు. మీడియం రేంజ్ హీరోలలో కొందరు 100 కోట్ల క్లబ్ లో ప్లేస్ సంపాదించారు. కానీ అక్కినేని హీరోలు మాత్రం ఇంకా వందకు దగ్గరగా రాలేకపోతున్నారు.


'ఈగ' సినిమాతోనే నేచురల్ స్టార్ నాని వంద కోట్ల మార్క్ క్రాస్ చేసినప్పటికీ, అది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఈగ ఖాతాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి గట్టిగా ట్రై చేస్తున్న నాని.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు 'దసరా' మూవీతో డ్రీమ్ రన్ సాధించాడు. మాస్ మహారాజా రవితేజ గతేడాది చివర్లో 'ధమాకా' సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' వంటి 200 కోట్ల సినిమా కూడా చూసాడు. 


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'గీతగోవిందం' చిత్రం బాక్సాఫీస్ వద్ద నూరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం విక్టరీ వెంకటేష్ తో కలిసి 'ఎఫ్ 2' లాంటి వంద కోట్ల సినిమా రుచి చూసాడు. 'కార్తికేయ 2' సినిమాతో యువ హీరో నిఖిల్ సిద్దార్థ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటి, 100 కోట్ల క్లబ్ లో చేరాడు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఎంట్రీతోనే 'ఉప్పెన' లాంటి వంద కోట్ల రికార్డ్ కొట్టేశాడు. ఇప్పుడు లేటెస్టుగా మరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా 'విరూపాక్ష' సినిమాతో వంద కోట్ల క్లబ్ కి అతి చేరువలో ఉన్నాడు. 


అయితే టైర్-2 హీరోల లిస్టులో ఉన్న అక్కినేని బ్రదర్స్ యువ సామ్రాట్ నాగచైతన్య, యూత్ కింగ్ అఖిల్ మాత్రం ఇంకా 100 కోట్ల మార్క్ ని అందుకోలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తో 50 కోట్ల వసూళ్లు రాబట్టిన అఖిల్.. 'ఏజెంట్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. దీంతో అక్కినేని అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు చైతన్యపై ఉన్నాయి. 'కస్టడీ' సినిమాతో చై కచ్చితంగా 100 కోట్ల హీరో అనిపించుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. 


నాగచైతన్య నటించిన 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద 60 - 75 కోట్ల వరకూ కలెక్ట్ చేసాయి. అయితే గతేడాది వచ్చిన 'థాంక్యూ' సినిమా చైతూ కెరీర్ పై పెద్ద దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'కస్టడీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు చై. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్, శుక్రవారం (మే 12) తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.  


Also Read : వచ్చే నెలలోనే థియేటర్లలోకి నాగశౌర్య 'రంగబలి' - రిలీజ్ డేట్ ఫిక్స్


ఇప్పటికే 'కస్టడీ' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సరికొత్త కథతో నాగచైతన్యను ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతార్ లో ప్రెజెంట్ చేసారు. ఇది చై కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ. ఫస్ట్ బైలింగ్విల్ ప్రాజెక్ట్. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగడంతో, నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తో సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాన్సెప్ట్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అక్కినేని హీరోల 100 కోట్ల కల నెరవేరుతుందేమో చూడాలి.


Also Read మహేష్ సినిమా టైటిల్ అదేనా? సెంటిమెంట్ కంటిన్యూ చేసిన త్రివిక్రమ్