సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నరేష్, పవిత్ర మధ్య ప్రేమయాణాన్ని 'మళ్ళీ పెళ్లి' పేరుతో వెండితెరపై చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి.


ఎమ్మెస్ రాజు ఆలోచనలు యంగ్ గా ఉంటాయి- నరేష్


తాజా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటుడు నటుడు, దర్శకుడు రాజు ఈ సినిమాకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. యంగ్ ఆలోచనలు ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే యువ ప్రపంచాన్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుందని, అందుకే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాకు ఎమ్మెస్ రాజును డైరెక్టర్ గా తీసుకున్నట్లు నరేష్ వెల్లడించారు. “ఎమ్మెస్ రాజు ఆలోచనలు చాలా యంగ్ గా ఉంటాయి. యువ ప్రపంచానికి కనెక్ట్ అయితేనే సినిమా సక్సెస్ అవుతుంది. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఈ సినిమాలో అదే చూపించాం. ఏ ఒక్కరికో సంబంధించిన సినిమా కాదు. ఈ సినిమాలో చాలా యాంగిల్స్ ఉన్నాయి” అని వివరించారు.


సినిమా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి- నరేష్


‘మళ్ళీ పెళ్లి’ మీ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానా? అనే ప్రశ్నకు నరేష్ తెలివిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. “అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే  కథ రిలీవ్ అయినట్లే కదా. అందుకే కథను నేను రివీల్ చేయలేను. సినిమా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇది యూనిక్ ఫిల్మ్” అన్నారు. రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్  తర్వాత మీ బయోపిక్ మీరు తీసుకుంటున్నట్లుగా ఉందనే వ్యాఖ్యలపై నరేష్ స్పందించారు. “అది బయోపిక్, ఇది ఎంటర్ టైనర్. ఇది నా సబ్జెక్ట్ కాదు” అని చెప్పారు.


తెలుగు, కన్నడలో ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే?- నరేష్


ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి కారణం ఉందన్నారు నరేష్. “పవిత్ర కర్నాటకలో పాపులర్. నేను తెలుగులో పాపులర్. ఈ రెండు భాషల్లో విడుదల చేస్తే సినిమా కనెక్ట్ అవుతుందని భావించాం. నిజానికి ఈ సినిమా ఓ 600 భాషల్లో తీయాలి. ప్రస్తుతం 5 భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నాం. మున్ముందు ఎక్కువ భాషల్లో డబ్ చేసే అవకాశం ఉంది” అన్నారు.


రూ. 15 కోట్లు ఖర్చు పెట్టి రివేంజ్ ప్లాన్ చేయలేను- నరేష్


ఈ సినిమాతో మీ మూడో భార్య మీద రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు నరేష్ నవ్వుతూ సమాధానం చెప్పారు. “రివేంజ్ తీర్చుకోవాలి అంటే కత్తులతో పొడుచుకోవాలి. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి. కోర్టులకు పోవాలి. సినిమా ద్వారా ఏం రివేంజ్ తీర్చుకుంటాం? సినిమా అనేది ఎంటర్ టైన్మెంట్. రూ. 15 కోట్లు ఖర్చు పెట్టి  రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం నేను చేయలేను” అన్నారు.  


ఫస్ట్ హాఫ్ కంటే సెకెండ్ హాఫ్ లైఫ్ బాగుండాలి - ఎమ్మెస్ రాజు


'మళ్ళీ పెళ్లి' సినిమా గురించి దర్శకుడు రాజు ఆసక్తికర విషయం చెప్పారు. “సినిమా అనేది ఫస్ట్ హాఫ్ కంటే సెకెండ్ హాఫ్ బాగుండాలి అని ఎలా కోరుకుంటామో? లైఫ్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం. కానీ, చాలా మందికి  ప్రపంచలో సెకెండ్ హాఫ్ లైఫ్ బాగా లేదు. దీని మీద సినిమా చేయాలి అనుకున్నాం. తీశాం “ అని చెప్పుకొచ్చారు.   


Also Read : నేను ఏ తప్పూ చేయలేదు, క్లారిటీ ఎందుకు? - నాగ చైతన్యతో డేటింగ్‌పై శోభితా ధూళిపాళ



'మళ్ళీ పెళ్లి' సినిమాలో జయసుధ, శరత్‌ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు  సురేష్ బొబ్బిలి  స్వరాలు సమకూర్చగా, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.


Read Also: పెళ్లి నుంచి మోహన్ బాబు షూటింగుకు, హనీమూన్ లేదు, ఏవీఎస్ రూమ్‌లో ఫస్ట్ నైట్ – బ్రహ్మాజీ