ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారాల్లో ఒకటైన దాదాసాహెబ్ పాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును 2023 ఏడాదిగాను వహీదా రెహమాన్ కు అందజేస్తున్నట్లు కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ తాజాగా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు సుమారు ఐదు దశాబ్దాల పాటు సినీ రంగానికి వహీదా రెహమాన్ అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయబోతున్నట్లు ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు.






'గైడ్', 'ప్యాసా', 'కాగజ్కే పూల్', 'సాహెబ్ బీవీ ఔర్ గులామ్', ఖామోషీ వంటి సినిమాలతో పాటు మరెన్నో బాలీవుడ్ సినిమాల్లో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారని అనురాగ్ ఠాకూర్ తన ట్వీట్ లో తెలియజేశారు. అంతేకాకుండా 'రేష్మ ఔర్ షేరా' అనే సినిమాలో వహీదా రెహమాన్ తన అద్భుత నటనతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.


కమిట్మెంట్, హార్డ్ వర్క్ తో గొప్పనటిగా అత్యంత శిఖరాలని అధిరోహించారని పద్మశ్రీ, పద్మభూషణం వంటి అవార్డులను సొంతం చేసుకున్న ఎంతోమంది మహిళలకు వహీదా రెహమాన్ ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా పేర్కొన్నారు అనురాగ్ ఠాకూర్. మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తరుణంలో వహీదా రెహ్మాన్ కు దాదాసాహెబ్ పాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇక వహీదా రెహమాన్ విషయానికొస్తే.. 1955లో 'రోజులు మారాయి' అనే తెలుగు చిత్రంతో నటిగా తెరంగెట్రం చేశారు. ఈ సినిమాలోని ఏరువాక సాగారో రన్నో చిన్నాన్న అనే పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఇక ఆ తర్వాత 1956లో సీఐడీ (CID) అనే చిత్రంతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో బాలీవుడ్లో ఈమెకి వరుస అవకాశాలు వచ్చాయి. హిందీ తో పాటు దక్షిణాది భాషల్లో సుమారు 100కు పైగా సినిమాలు చేశారు. తన సినీ జీవితంలో1971లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు, 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. చివరగా 2021లో రిలీజ్ అయిన 'స్కేటర్ గర్ల్' అనే సినిమాలో నటించగా, ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమయ్యారు. అలా ఐదు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న వహీదా రెహమాన్ కి 2023 ఏడాదికి గాను దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం విశేషం.


Also Read : ‘నువ్వెంత’ అంటూ శివాజీపై నోరుపారేసుకున్న గౌతమ్ - పల్లవి ప్రశాంత్‌పై అమర్ దీప్ ప్రతాపం



Join Us on Telegram: https://t.me/abpdesamofficial