బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచాయి. పవర్ అస్త్రా గెలుచుకుంటే సేఫ్ అయిపోవచ్చు అనుకున్న కంటెస్టెంట్స్‌కు కూడా కొత్త బాధ్యతలు ఇచ్చి వారికి, ఇతర కంటెస్టెంట్స్‌కు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా జరిగిన నామినేషన్సే దానికి ఉదాహరణ. ఇప్పటివరకు పవర్ అస్త్రా గెలుచుకున్న సందీప్, శివాజీ, శోభా శెట్టిలను జడ్జిలుగా పెట్టి కంటెస్టెంట్స్ చెప్తున్న కారణాలను బట్టి ఎవరిని నామినేట్ చేయాలో డిసైడ్ చేయమన్నారు. దీంతో ఆ ముగ్గురిలో అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్‌తో కూడా వారికి వాగ్వాదాలు జరుగుతున్నాయి. గౌతమ్ కృష్ణతో శివాజీకి జరిగిన వాగ్వాదం వల్ల గౌతమ్ సహనం కోల్పోయినట్టు తాజాగా విడుదలయిన ప్రోమోలో తెలుస్తోంది.


లాయర్‌లాగా మారిపోయిన శివాజీ


నిన్న (సెప్టెంబర్ 26న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో గౌతమ్.. యావర్‌ను నామినేట్ చేశాడు. దానికి చెప్పిన కారణం జడ్జిలకు కరెక్ట్ అనిపించలేదు. దీంతో యావర్‌ను అలా నామినేట్ చేయడానికి వారు ఒప్పుకోలేదు. ముఖ్యంగా శివాజీ.. యావర్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టుగా అనిపించింది. దీంతో ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అదే కంటిన్యూ అవ్వనుంది. యావర్‌కు సపోర్ట్ చేస్తున్న శివాజీని తప్పుబట్టాడు గౌతమ్. దీనికి గౌతమ్ ఒప్పుకోలేదు. టాస్కులలో ఓడిపోయిన ప్రతీసారి అందరితో యావర్ అలాగే ప్రవర్తిస్తున్నాడు అని గౌతమ్ చెప్పగా.. అందరి గురించి నువ్వు మాట్లాడకు అంటూ శివాజీ ఎదురు సమాధానం చెప్పాడు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా తన ఇంట్లోవాళ్లు అన్నాడు గౌతమ్.


‘‘మనం గేమ్ ఆడుతున్నాం. కుటుంబం కాదు’’ అన్నాడు శివాజీ. దానికి మీరు లాయర్‌లాగా ఒక్క సైడే మాట్లాడుతున్నారు అని గౌతమ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానికి శివాజీ ఒప్పుకోలేదు. దానికి గౌతమ్ సహనాన్ని కోల్పోయి, చేతిలో ఉన్న గొడుగును విసిరేసి, నువ్వెంత అని అరుస్తూ శివాజీ మీదకు రాబోయాడు. అయితే గౌతమ్ సహనం కోల్పోయి అలా ప్రవర్తించడం తప్పు అని అమర్‌దీప్ ఓపికగా చెప్పే ప్రయత్నం చేశాడు. ‘‘నీకు నువ్వే బాంబు పెట్టుకుంటున్నావు’’ అని అర్థమయ్యేలా చెప్పాడు. దీంతో సందీప్‌తో మాట్లాడడానికి వెళ్లాడు గౌతమ్. కానీ సందీప్ కూడా గౌతమ్‌తో ఒప్పుకోను అని ముక్కుసూటిగా చెప్పేశాడు.


మరోసారి పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్‌దీప్..


ఆ తర్వాత కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయడానికి అమర్‌దీప్ రంగంలోకి దిగాడు. తన తరపున నామినేషన్స్‌గా పల్లవి ప్రశాంత్, శుభశ్రీని బోణులలో నిలబెట్టాడు. ముందుగా పల్లవి ప్రశాంత్ ఇంకా మాస్కును మెయింటేయిన్ చేస్తున్నాడు అంటూ కారణం చెప్పాడు. ‘‘రెండు మొహాలు వద్దు, రెండు నాలుకలు వద్దు’’ అన్నాడు. దానికి ప్రశాంత్ వెటకారంగా సమాధానమిచ్చాడు. పవర్ అస్త్రాకు కంటెండర్స్‌ను అనౌన్స్ చేసినప్పుడు పల్లవి ప్రశాంత్ ఏడ్చిన సందర్భాన్ని గుర్తుచేశాడు అమర్. దానికి ప్రశాంత్ నవ్వగా అమర్ సీరియస్ అయ్యాడు. అదేమీ పట్టించుకోకుండా ‘‘నాకు రెండు మొహాలు ఉన్నాయో.. నాలుగు మొహాలు ఉన్నాయో.. అది నా ఇష్టం, నా ఆట నేను ఆడతా, ఆడడానికి వచ్చాను. ప్రపంచంలో పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు’’ అంటూ గట్టిగా చెప్పాడు ప్రశాంత్. అమర్ కోపాన్ని పాయింట్ ఔట్ చేస్తూ మాట్లాడాడు. దానికి అమర్‌కు కోపం వచ్చి ‘‘అమర్ అంటే ఇలాగే ఉంటాడు’’ అని అరుస్తూ చెప్పాడు. దానికి పల్లవి ప్రశాంత్ అంటే కూడా ఇలాగే ఉంటాడు అని తను సమాధానమిచ్చాడు. దానికి అమర్‌దీప్ ఒప్పుకోలేదు.



Also Read: ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు-2’- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial