బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగోవారం నామినేషన్స్ ప్రసారానికి ఒక ఎపిసోడ్ సరిపోలేదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాగ్వాదాలు, గొడవలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఒక కంటెస్టెంట్.. మరొక కంటెస్టెంట్‌ను నామినేట్ చేయగా వారు నామినేషన్ కారణాన్ని ఒప్పుకోకుండా వాదనలు మొదలుపెడుతున్నారు. అలా అందరి కంటెస్టెంట్స్ నామినేషన్స్ రసవత్తరంగానే సాగాయి. నిన్న (సెప్టెంబర్ 25న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో కేవలం ముగ్గురి నామినేషన్స్ మాత్రమే పూర్తయ్యాయి. మిగతావారి నామినేషన్స్ నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో జరగనున్నాయి. దానికి సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


ప్రశాంత్ నామినేషన్స్‌లో రతిక జోక్యం


ముందుగా ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్.. తన నామినేషన్స్ గురించి చెప్పడానికి ముందుకు వచ్చినట్టు చూపించారు. ఆ క్రమంలో అమర్‌దీప్‌ను, గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు ప్రశాంత్. శోభా శెట్టితో గొడవ అయినప్పుడు గౌతమ్ షర్ట్ విప్పడం తనకు నచ్చలేదని కారణంగా చెప్పాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టిన గౌతమ్.. రతిక గురించి మధ్యలో మాట్లాడడం మొదలుపెట్టాడు. రతిక.. ఒకసారి వన్ పీస్ వేసుకున్నప్పుడు ప్యాంట్ వేసుకోలేదా అని ప్రశాంత్ కామెంట్ చేశాడని గుర్తుచేశాడు. అది తాను ఫ్రెండ్‌షిప్‌లో చెప్పానని ప్రశాంత్ సమాధానమిచ్చింది.


దీనికి రతిక రియాక్ట్ అయ్యింది. ‘‘నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకెందుకు’’ అని ప్రశ్నించింది. దీంతో ప్రశాంత్.. అప్పట్లో తనతో రతిక ఎలా చనువుగా ఉండేదని ఇమిటేట్ చేసి చూపించాడు. దానికి రతిక.. ‘‘నోటికి ఏదొస్తే అది మాట్లాడకు’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రశాంత్‌కు, రతికకు ఈ గొడవ జరుగుతున్న క్రమంలోనే గౌతమ్ మళ్లీ షర్ట్ విప్పేసి.. ‘‘నువ్వు లాస్ట్ వరకు నామినేట్ చేసుకో. నా బాడీ నా ఇష్టం. షర్ట్ విప్పేసే తిరుగుతా’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.


నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా రతికకు, ప్రశాంత్‌కు హాట్ డిస్కషన్ జరిగింది. ‘‘నా ప్రాపర్టీ అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తావు’’ అంటూ పాత విషయాలను గుర్తుచేసుకుంది రతిక. అదేదో ఫన్‌లో అన్నాను అని ప్రశాంత్ సమాధానమివ్వగా.. ‘‘మజాక్‌లో చేయడానికి నేను ఎవర్రా నీకు’’ అంటూ ముక్కుసూటిగా అడిగేసింది. ఆ తర్వాత అమర్‌దీప్.. పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ సమయంలో ధైర్యం చేయలేదనే కారణంతో నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్.


అమర్‌దీప్ వర్సెస్ శుభశ్రీ


ఇక తన నామినేషన్స్ వినిపించడానికి అమర్‌దీప్ ముందుకొచ్చాడు. తనను నామినేట్ చేసినా పల్లవి ప్రశాంత్, శుభశ్రీలనే తను కూడా నామినేట్ చేశాడు. తను పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ సమయంలో ఓడిపోయానని ఒప్పుకున్నానని, అయినా కూడా వాడు ఓడిపోయాడు అని చెప్పడంలో పాయింట్ లేదు అంటూ శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ప్రియాంకతో చనువుగా ఉండి ఆడడం తన స్ట్రాటజీ అని బయటపెట్టాడు. తనకు శుభశ్రీ చెప్పిన పాయింట్ హర్టింగ్ అనిపించింది అని, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.


తను నామినేట్ చేసిన కారణంతో తనను నామినేట్ చేయడమేంటి అది ఒక కారణమా అని అడుగుతూ ఛీ కొట్టింది శుభ. దానికి నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు అమర్. ‘‘ఇప్పుడెలా డిఫెండ్ చేస్తున్నారు, అప్పుడు అలా చేయడానికి దమ్ము లేదు కదా’’ అని రెచ్చగొడుతూ మాట్లాడింది శుభ. ‘‘నేను చేయను నా ఇష్టం’’ అని గట్టిగా సమాధానమిచ్చాడు అమర్. గేమ్ ఆడలేదు అంటే కూడా నా ఇష్టం అంటూ అరిచాడు. ‘‘ఒకరిని కాపాడడానికి మరొకరిని ఇరికిస్తున్నారు’’ అని అన్నాడు. ఒకరికి ఒకరు ఇది సిల్లీ రీజన్ అని అరుచుకున్నారు. ఆ తర్వాత శుభశ్రీ హౌజ్‌లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రోమో ముగిసింది.



Also Read: విడాకుల ప్రశ్నకు 'కలర్స్' స్వాతి సమాధానం ఏమిటో తెలుసా? - వైరల్ స్టేట్మెంట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial