ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిని పార్లమెంట్ సభ్యుడి పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేయడంపై వ్యంగ్యంగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుకుందాం..


వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తాజాగా రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు సెన్సేషనల్ తీర్పు వెల్లడించింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మోడి ఇంటిపేరు ఉన్న వాళ్లందరూ దొంగలు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్ కు రెండు సంవత్సరాల పాటు శిక్షవిధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్ సభ్యుడి పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ అంశంపై వివేక్ అగ్నిహోత్రి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  


రాహుల్ గాంధీపై సంచలన ట్వీట్


నిజానికి రాహుల్ గాంధీ రాజకీయాలకు అర్హత లేని నాయకుడని వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. అయితే, ఈసారి అధికారికంగా రుజువైందంటూ సంచలన కామెంట్స్ చేశారు. “రాజకీయాల్లో ఎల్లప్పుడూ అర్హత లేని వ్యక్తి రాహుల్ గాంధీ. అయితే, ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.






ఇందిరాగాంధీపై అనర్హత వేటు అంశాన్ని గుర్తు చేసిన వివేక్


ఈ సందర్భంగా ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. గతంలో ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమె నిజాయితీ కలిగిన నాయకురాలు కాబట్టి మళ్లీ పుంజుకుందన్నారు. “ఇందిరాగాంధీపైన అనర్హత వేటు పడిన సమయంలో కూడా కాంగ్రెస్‌ వాదులు దుమ్మెత్తిపోశారు. కానీ, ఆమె నిజమైన నాయకురాలు కాబట్టి తిరిగి పుంజుకున్నారు. మాస్ బేస్ ఉన్న నాయకుడు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పటిష్టనాయకత్వం లేక నానా ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదన్నారు.  ఇందిరా గాంధీ కాశ్మీర్‌ను కాపాడి ఉంటే, తాను ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా తీసి ఉండేవాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు.










సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివేక్ కామెంట్స్


ప్రస్తుతం వివేక్ ట్వీట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే, మరికొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి వివేక్, తరచుగా లెఫ్ట్ భావజాలంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా తర్వాత తన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టారు. దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై తీవ్ర స్థాయిలో ఆయన స్పందిస్తున్నారు.


Read Also: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు