Vishal’s Rathnam seals its release date : కోలీవుడ్ హీరో విశాల్ గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా కోలీవుడ్లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి విశాల్ కి భారీ కం బ్యాక్ ఇచ్చింది. తెలుగులో థియేటర్స్ లో విడుదలై పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలంగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న విశాల్ 'మార్క్ ఆంటోనీ' సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మార్క్ ఆంటోనీ తర్వాత విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రత్నం'.
కోలీవుడ్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విశాల్ - హరి కాంబినేషన్లో 'భరణి', 'పూజ' లాంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో 'రత్నం'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాఈ సినిమా ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని హీరో విశాల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రత్నం షూటింగ్ మొత్తం పూర్తయిందని, యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా పండుగగా ఉంటుందని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయబోతున్నారు.
విశాల్ - హరి కాంబినేషన్లో వచ్చిన గత యాక్షన్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని ఓ సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాని రూపొందించినట్లు దర్శకుడు హరి తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విశాల్ వెంటనే తన తదుపరి ప్రాజెక్టు 'డిటెక్టివ్ 2' ఫోకస్ చేశాడు. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన 'డిటెక్టివ్' ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని స్వయంగా విశాల్ డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్ తో మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.