Vishal Suddenly Fainted On Stage: కోలీవుడ్ స్టార్ విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సడన్‌గా వేదికపైనే కుప్పకూలారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ప్రథమ చికిత్స అందించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.


అసలేం జరిగిందంటే?


తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాగంలోని కూత్తాండవర్ ఆలయంలో చిత్తిరై (తమిళ మాసం) వేడుకల సందర్భంగా ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్లకు నిర్వహించిన 'మిస్ కూవాగం 2025' పోటీల ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా విశాల్ హాజరయ్యారు. స్టేజ్ మీదకు వచ్చిన విశాల్ (Vishal) ఉన్నట్లుండి ఒక్కసారిగా వేదికపైనే కుప్పకూలారు. దీంతో ఆయనకు ఏమైందో అంటూ అక్కడి వారితో పాటు ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.


వెంటనే ప్రథమ చికిత్స అందించగా కాస్త కోలుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి, ఈవెంట్ నిర్వాహకులు ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆస్పత్రి నిర్వాహకులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. విశాల్ సరిగ్గా భోజనం చేయకపోవడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని ఆయన మేనేజర్ హరి తెలిపారు. దాదాపు గంట పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత విశాల్ తిరిగి ఈవెంట్‌కు హాజరయ్యారని తమిళ మీడియా పేర్కొంది.


పూర్తి ఆరోగ్యంగా విశాల్


అయితే.. విశాల్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. జనవరి 'మద గజ రాజా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చాలా నీరసంగా వణుకుతూ కనిపించారు. అప్పుడే ఆయన ఆరోగ్యంపై పలు రూమర్లు హల్చల్ చేశాయి. విశాల్ ఇలా అయిపోయారేంటి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. ఈ రూమర్లను కొట్టి పారేసిన ఆయన టీం.. విశాల్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారని అప్పట్లో క్లారిటీ ఇచ్చింది.


ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని ఆయన టీం స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోలేదని.. జ్యూస్ మాత్రమే తాగారని.. అందుకే స్పృహ కోల్పోయినట్లు మేనేజర్ హరి తెలిపారు. టైంకు ఫుడ్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్లు చెప్పారు. 






Also Read: వెంకటేష్ ‘తులసి’, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ టు ఎన్టీఆర్ ‘సాంబ’, అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ వరకు- ఈ సోమవారం (మే 12) టీవీలలో వచ్చే సినిమాలివే..


ఇక సినిమాల విషయానికొస్తే విశాల్ ఇటీవలే 'మద గజ రాజా'లో నటించారు. ప్రస్తుతం 'తుప్పరివాలన్ -2'లో నటించారు. ఈ మూవీ తెలుగులో 'డిటెక్టివ్' పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది.