తక్కువ సమయంలో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన తమిళ దర్శకులు జాబితాలో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) పేరు ముందు వరుసలో ఉంటుంది. లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన 'విక్రమ్' బాక్సాఫీస్ బరిలో పలు రికార్డులు నమోదు చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా 'కూలీ' డైరెక్టర్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్.
తమిళ ప్రేక్షకులను మాత్రమే కాదు... భారతీయ ప్రేక్షకులను కూడా మెప్పించిన హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్. వాళ్ళిద్దరికీ పాన్ వరల్డ్ స్థాయిలో ఫాలోయింగ్ ఉందని చెబితే అతిశయోక్తి కాదు. ఆ ఇద్దరు హీరోలు గతంలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరిని ఒకే కథతో మెప్పించిన దర్శకుడు ఎవరు లేరు. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ కోరికను త్వరలో నిజం చేయబోతున్నారు లోకేష్ కనకరాజ్.
గ్యాంగ్‌స్టర్స్ కథతో మల్టీస్టారర్!లోకేష్ కనకరాజ్ ఓ తమిళ మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. ''ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌కు సంబంధించిన కథను రజనీ, కమల్ గారికి చెప్పాను. ఇద్దరూ ఓకే అన్నారు'' అని లోకేష్ కనకరాజ్ తెలిపారు. ఆ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే... ఇప్పట్లో ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం లేదు. ప్రస్తుతం లోకేష్ లైనప్ ఫుల్ అయ్యింది.
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ' సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు నిర్మాతల నుంచి తనకు ఒత్తిడి ఉండేదని, ముందుగా విడుదల తేదీ ఖరారు చేయడం వల్ల అనుకున్న తేదీకి సినిమాలు తీసుకు రావడం కోసం పని చేసే వాడినని, 'కూలి'కి మాత్రం ఎటువంటి ఒత్తిడి లేకుండా సినిమా తీసిన తర్వాత విడుదల తేదీ ఖరారు చేశామని తెలిపారు.
Lokesh Kanagaraj Upcoming Movies: 'కూలి' తర్వాత కార్తీ కథానాయకుడిగా 'ఖైదీ 2' చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ కన్ఫర్మ్ చేశారు. ఆ తరువాత కమల్ హాసన్ 'విక్రమ్ 2', దళపతి విజయ్ హీరోగా 'లియో 2', సూర్య హీరోగా 'రోలెక్స్' సినిమాలు చేయనున్నట్లు ఈ యువ దర్శకుడు వివరించారు.