తమిళ నటులు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు విశాల్. పేరుకే తమిళ హీరో.. కానీ విశాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. స్క్రీన్‌పై తన నటన మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ తన మంచితనాన్ని అభిమానించే వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి విశాల్.. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలయిన ‘మార్క్ ఆంటోనీ’ టీజర్, ఫస్ట్ లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మరికొన్ని విశేషాలు పంచుకున్నాడు విశాల్.
ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు..
విశాల్ హీరోగా మారి 19 ఏళ్లు అయ్యిందని ముందుగా ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గుర్తుచేసుకున్నారు. 19 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 10న తన మొదటి చిత్రం ‘చెల్లం’.. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ చిత్రం విడుదలయిందని తెలిపాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రేక్షకులు తనను ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు. అందరూ తన గురించి చెప్తుంటే తృప్తిగా ఉందని అన్నాడు. కెప్టెన్ విజయ్‌కాంత్ అని ఒక వ్యక్తి ఉన్నారని, ఆయన ఆఫీసుకు వచ్చిన ఎవరినైనా ఆకలితో పంపించరని చెప్పిన విశాల్.. తమ ఆఫీసులో కూడా అలాగే చేస్తున్నామని చెప్పాడు. తన సినిమా టికెట్ కోసం పెట్టే డబ్బులు.. ఏదో ఒక విధంగా సమాజానికే ఉపయోగపడాలని అనుకుంటానని తెలిపాడు. ‘మార్క్ ఆంటోనీ’ అనేది తన కెరీర్‌లోని కాస్ట్‌లీ చిత్రమని బయపెట్టాడు.
అభినయ ఒక ఇన్‌స్పిరేషన్..
‘మార్క్ ఆంటోనీ’ సినిమాకు కారణమయిన వ్యక్తి వినోద్ అని తన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపాడు. ఒక పాటకు రూ.1 కోటి ఖర్చు అవుతుందని చెప్తే వద్దు అని అనకుండా అసవరమైతే ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా నిర్మాత ఆలోచించేవాడు కాదని బయటపెట్టాడు. ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంలో మార్క్ పాత్రకు జోడీగా రీతూ వర్మ నటించిందని, ఆంటనీ పాత్రకు భార్యగా అభినయ నటించిందని కథ గురించి చెప్పాడు. అభినయ గురించి మాట్లాడుతూ.. తను చాలామందికి స్ఫూర్తినిస్తుందని అన్నాడు. మాటలు రాకపోవడం, వినికిడి లోపం ఉండడం కాదు.. నటించడం వచ్చు అంటే చాలు.. ఇండస్ట్రీకి రావచ్చు అని చెప్పాడు.
సూసైడ్ చేసుకుంటానన్నాడు..
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు విశాల్. 9 సంవత్సరాల ముందు ఒక కథ రాసుకొని నిర్మాతల కోసం వెతికితే.. దాదాపు 40 మంది నిర్మాతలు గెంటేశారని అధిక్ గురించి చెప్పుకొచ్చాడు. ‘త్రిష లేదా నయనతార’ అనే సినిమాను తెరకెక్కించినందుకు యూత్ చప్పట్లు కొట్టినా కూడా అసలు నేనేనా సినిమా తీసింది అని తనకు తానే ఆశ్చర్యపోయాడని అన్నాడు. ‘‘ఒకరోజు అర్థరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నా, లెటర్‌లో మీ పేరే రాస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేసి ఏమైంది అని అడిగితే మీరు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగింది అన్నాడు. అయితే దేవుడు సహకరిస్తే కలిసి సినిమా చేస్తామేమో అన్నాను. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ చేస్తున్నాం’ అని అధిక్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి బయటపెట్టాడు. ఎస్‌జే సూర్య.. ‘మార్క్ ఆంటోనీ’లో తన పాత్ర కోసం 22 గంటలు డబ్బింగ్ చెప్పాడని అభినందించాడు. విశాల్, ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్ చేస్తున్న ‘మార్క్ ఆంటోనీ’.. సెప్టెంబర్ 15న అన్ని సౌత్ భాషల్లో విడుదల అవుతుండగా.. హిందీ వర్షన్ మాత్రం సెప్టెంబర్ 22న విడుదల అవుతుంది.
Also Read: పంచ్ ప్రసాద్‌కు సర్జరీ - డాడీ వెంటనే తిరిగి వచ్చేస్తారు, గుండె బరువెక్కిస్తోన్న కొడుకు మాటలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial