‘జబర్దస్త్’ ద్వారా ఎంతోమంది కమెడియన్స్.. ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో పంచ్ ప్రసాద్ ఒకడు. ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కోసం ఒక్కొక్క కామెడియన్‌కు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. పంచ్ ప్రసాద్ అయితే తన అనారోగ్యం మీదే జోకులు వేయించుకుంటూ అందరినీ నవ్విస్తాడు. చాలా ఏళ్ల నుంచి తనకు కిడ్నీ సమస్య ఉంది. ఈ విషయంపై ఎన్నోసార్లు స్టేజ్‌ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తను మాత్రమే కాదు.. తన భార్య కూడా ఈ విషయంపై పలుమార్లు ఓపెన్‌గా మాట్లాడింది. తాజాగా పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్ జరిగిందని, అది కూడా సక్సెస్ అయ్యిందని తన భార్య.. వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.


రాత్రంతా పరీక్షలు..
ముందుగా ఈ వీడియోలో కిడ్నీ దొరికిందని, ఆసుపత్రికి రమ్మని వారికి ఫోన్ వచ్చిందని పంచ్ ప్రసాద్ భార్య వీడియోను మొదలుపెట్టింది. అర్థరాత్రి 12 గంటలకు వారికి ఫోన్ రాగా.. ఉదయం 3 గంటలకు వారు ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపు ఆసుపత్రిలో వెయిట్ చేసిన తర్వాత డాక్టర్లు.. పంచ్ ప్రసాద్‌కు కావాల్సిన పరీక్షలు చేశారు. రక్తపరీక్షతో పాటు మరికొన్ని పరీక్షలు చేసినట్టుగా వీడియోలో చూపించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత అసలు ఏ టైమ్‌కు ఫోన్ వచ్చింది అంటూ ప్రసాద్‌ను ఆడియన్స్‌తో చెప్పమంది తన భార్య. అయితే వారికి ముందుగా అర్థరాత్రి 12 గంటలకు ఒకసారి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత ఉదయం 2 గంటలకు కూడా మళ్లీ ఫోన్ వచ్చిందని, దాంతో వారు వెంటనే బయలుదేరి 3 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారని క్లారిటీ ఇచ్చారు.


ధైర్యం కోసం..
పంచ్ ప్రసాద్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉదయం టెస్టులు పూర్తయ్యాయని ఫోన్ రాగా.. ప్రసాద్ తన భార్యతో కలిసి మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. ఉదయం జరిగిన రెండు టెస్టుల్లో ఒక రిపోర్ట్ వచ్చిందని ప్రసాద్ భార్య తెలిపింది. ఇంకొక టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు, ఏంటి అనే వివరాలు డాక్టర్ చెప్తానన్నారు అని చెప్పింది. పంచ్ ప్రసాద్ మాత్రం భయపడుతున్నాడని, ధైర్యం కోసం అందరికీ ఫోన్ చేస్తున్నారని తనను చూపించింది. అప్పుడు తన తమ్ముడికి ఫోన్ చేస్తున్నానని ప్రసాద్.. ఆడియన్స్‌కు చెప్పాడు. మరికొన్ని పరీక్షలు పూర్తయ్యే సమయానికి ప్రసాద్ తమ్ముడు, తన ఫ్రెండ్ ఆసుపత్రికి వచ్చారు.


డాడీ వెంటనే తిరిగొచ్చేస్తారు..
పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత పంచ్ ప్రసాద్‌ను డయాలసిస్ కోసం సిద్ధం చేశారు డాక్టర్స్. ఆ సమయంలో ప్రసాద్ కొడుకు ‘డాడీ వెంటనే తిరిగొచ్చేస్తారు’ అంటూ అమ్మకు ధైర్యం చెప్పాడు. ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ప్రసాద్ దగ్గరకు వెళ్లిన తన భార్య ‘ఇదే చివరి డయాలసిస్ అవ్వాలని కోరుకుంటున్నావా’ అని అడిగింది. ‘అవుతుందిలే’ అని చిన్న నవ్వుతో సమాధానమిచ్చాడు ప్రసాద్. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లేముందు ప్రసాద్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. సర్జరీ జరిగింది అని చెప్పడంతో వీడియో ముగించింది ప్రసాద్ భార్య. అసలు సర్జరీ ఎలా జరిగింది అనే విషయాన్ని తరువాతి వీడియోలో అప్డేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా చాలామంది కాల్స్ చేస్తున్నారని, అందరి కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నానని క్షమాపణ అడిగింది.


Also Read: విదేశాల్లోనూ మన ‘జవాన్’ భీభత్సం, హాలీవుడ్ మూవీస్‌తోనూ పోటాపోటీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial