‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో నామినేషన్స్ అనగానే అప్పటివరకు ఉన్న హౌజ్ వాతావరణం అంతా మారిపోతుంది. ఒకరి చేసే తప్పులను మరొకరు చెప్తూ, వారి ప్రవర్తనలో నచ్చని విషయాలు చెప్తూ నామినేషన్స్ జరుగుతాయి. కానీ అది ఎదుటి కంటెస్టెంట్‌కు నచ్చాలని రూల్ ఏమీ లేదు. అందుకే వారు తిరిగి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది కచ్చితంగా వాగ్వాదానికే దారితీస్తుంది. అలాగే ‘బిగ్ బాస్’ సీజన్ 7 ప్రారంభమై వారం రోజులు అయ్యింది. ఈ వారం రోజులు పల్లవి ప్రశాంత్ మాట్లాడినవి, చేసినవి చూసిన అమర్‌దీప్.. ఒక్కసారిగా అవన్నీ నచ్చక తన మీద ఫైర్ అవ్వడం మొదలుపెట్టాడు. ఈసారి ‘బిగ్ బాస్’లో జరిగిన నామినేషన్స్‌లో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వాదం హైలెట్‌గా నిలిచిందని తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే తెలుస్తోంది.
తాజాగా విడుదలైన నామినేషన్స్ ప్రోమోలో ముందుగా పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయాలి అనుకునేవారిని ముందుకు రమ్మన్నారు ‘బిగ్ బాస్’. అలా చెప్పగానే అమర్‌దీప్, దామిని, షకీలా, ప్రియాంక, గౌతమ్ కృష్ణ ముందుకొచ్చారు. అసలు అతడిని నామినేట్ చేయడానికి కారణం ఏంటి అని అడగగా షకీలా.. ‘‘వాడిని నేను చెప్పలేను. నువ్వు నాకు ఎక్కువగా కనిపించడం లేదు’’ అంటూ కారణం చెప్పి నామినేట్ చేసింది. ఆ తర్వాత దామిని వచ్చి ‘‘నాకు ఎంతమంది తోబుట్టువులు చెప్పరా’’ అంటూ ప్రశాంత్‌ను అడిగింది. ‘‘నాకేం తెలుసు అక్క’’ అంటూ సమాధానమిచ్చాడు ప్రశాంత్. ‘‘నీకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. ఎంతసేపు నీ గురించే చెప్పుకుంటావు కానీ మా గురించి అడగవు’’ అంటూ ప్రశాంత్‌ను ఆ కారణంతో నామినేట్ చేసింది దామిని. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్ చేసిన నామినేషన్స్‌తో మరింత హీటెక్కింది.
రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు..
గౌతమ్ కృష్ణ వచ్చి ప్రశాంత్ ఊరికే రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు అని చెప్తుండగానే.. ‘‘నేను చేసే పని గర్వంగా చెప్పుకుంటున్నా.. తప్పా?’’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు ప్రశాంత్. అలా ఎదురు మాట్లాడడం ప్రియాంకకు నచ్చలేదు. మధ్యలో మాట్లాడవద్దు అంటూ గట్టిగా చెప్పింది. ఆ తర్వాత గౌతమ్.. ‘‘నువ్వు ఒక పోస్ట్ పెడితే నీకు రూ.1 లక్ష ఇస్తారు’’ అనగానే.. ‘‘ఆ లక్ష నేను తీసుకోను నిరుపేద రైతు కుటుంబానికే ఇస్తా’’ అని సమాధానమిచ్చాడు ప్రశాంత్. ఇలా నామినేషన్స్ ప్రక్రియ మొత్తంలో పల్లవి ప్రశాంత్ మాట్లాడిన మాటలు అన్నీ సైలెంట్‌గా విన్న అమర్‌దీప్.. రంగంలోకి ఎంటర్ అయ్యాడు.
ఆ యాక్టింగ్ ఇక్కడ చేయకు..
‘‘గౌతమ్ ఇచ్చిన లక్షను రైతు కుటుంబానికి ఇస్తా అంటున్నావు. కానీ, ఆ స్థానంలో రిక్షా డ్రైవర్, లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్‌కు ఇస్తా.. అని ఎందుకు చెప్పవు’’ అనే ప్రశ్నతో నామినేషన్‌ను ప్రారంభించాడు అమర్‌దీప్. దానికి పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా నిలబడ్డాడు. వీడియోల్లో తను చూపించిన బాడీ లాంగ్వేజ్‌కు, ఇప్పుడు ఉన్న బాడీ లాంగ్వేజ్‌కు తేడా ఉందని ప్రశాంత్‌ను విమర్శించాడు అమర్‌దీప్. ఆ తర్వాత బీటెక్ చేసి, సిటీలకు వచ్చి, ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతున్న వారి గురించి అమర్‌దీప్ ఎమోషనల్‌గా మాట్లాడగా.. దానికి సందీప్, రతిక కూడా చప్పట్లు కొడుతూ సపోర్ట్ చేశారు. తను మాట్లాడుతున్న సమయంలో పల్లవి ప్రశాంత్ ప్రవర్తన నచ్చని అమర్‌దీప్ ‘‘ఇలా చేయకు. నేను నీకన్నా పెద్ద నటుడిని’’ అని బెదిరించాడు.
దానికి ప్రశాంత్ కూడా గట్టిగా ‘చెప్పు’ అని అరిచాడు. ‘‘ప్రతీసారి రైతుబిడ్డ అనే పదం వాడొద్దు’’ అని అమర్‌దీప్ చెప్పగా.. అలా వాడలేదు అంటూ ప్రశాంత్ వాగ్వాదానికి దిగాడు. ‘‘సీరియల్స్‌లో పనిచేసి వచ్చానని ఇక్కడ చెప్పకు’’ అని ప్రశాంత్ అనగా.. ‘‘నువ్వు నేర్చుకొని వచ్చిన నటుడివి’’ అన్నాడు అమర్‌దీప్. మధ్యలో సందీప్ కూడా ‘‘ఈ దేశంలోని ప్రతీ ఒక్కడూ రైతుబిడ్డే. మా తాత కూడా రైతే’’ అని అన్నాడు. అందరూ మాట్లాడిన మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఏడుస్తూ ‘‘ఈ స్టూడియో బయట కుక్కలాగా తిరిగాను’’ అని గుర్తుచేసుకున్నాడు. ‘‘మరి కుక్కలాగా తిరిగి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు’’ అంటూ రతిక కూడా ప్రశాంత్ మీద సీరియస్ అయ్యింది. మొత్తానికి ఈసారి ‘బిగ్ బాస్’ నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్‌పై వేయబోయే నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
Also Read: రతిక ఏం పీకుతున్నావ్? టేస్టీ తేజ నోటి దురుసు, వాడి వేడిగా ‘‘బిగ్ బాస్’’ నామినేషన్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial