Kollywood Actor Vishal Marriage Postponed: కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సికల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్‌లో వీరిద్దరూ తన ప్రేమ విషయం బయటపెట్టి ఆగస్ట్ 29న వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తాజాగా వీరి పెళ్లి వాయిదా పడనుందంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.


అసలు రీజన్ ఏంటంటే?


తాజాగా ఓ ఈవెంట్‌లో పెళ్లి గురించి మాట్లాడిన విశాల్... 'తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవనం కోసమే పెళ్లి చేసుకోలేదు. మా పెళ్లి ఆ భవనంలోనే జరుగుతుంది. ఆ భవంతి కోసం 9 ఏళ్లుగా ఎదురుచూశా. ఇంకో రెండు నెలలు ఆగలేనా?. నడిగర్ సంఘం భవనంలో జరిగే ఫస్ట్ మ్యారేజ్ నాదే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే బుక్ చేసుకున్నా. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు.' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పెళ్లి వాయిదా పడుతుందా? అనే ప్రచారం ఊపందుకుంది.


రెండు గుడ్ న్యూస్‌లు


అదే రోజు రెండు గుడ్ న్యూస్‌లు విశాల్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 29న తన పుట్టినరోజు కాగా ఆ రోజు మ్యారేజ్ చేసుకోవాలని భావించారు. అయితే, నడిగర్ సంఘం భవనంలోనే తన పెళ్లి చేసుకోవాలని భావించిన విశాల్... ఆ భవనం నిర్మాణం వరకూ ఆగనున్నట్లు సమాచారం. ఆ రోజున నడిగర్ సంఘం భవనం ప్రారంభం గురించి, రెండోది తన పెళ్లి కొత్త డేట్ గురించి అనౌన్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఆ గుడ్ న్యూస్‌లు ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 29 వరకూ ఆగాల్సిందే.


విశాల్‌కు గతంలో హీరోయిన్ అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి పెళ్లి అంశం అప్పటికే హాట్ టాపిక్‌గా మారగా చెన్నైలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తారని అప్పట్లో చెప్పారు విశాల్.


Also Read: వీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?


కాగా, నడిగర్ సంఘం భవన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. 2017లో ఈ భవన నిర్మాణం చేపట్టినప్పటికీ పలు కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఇంకో 2 నెలలు ఆగలేనా? అంటూ కామెంట్ చేశారు. దీంతో త్వరలోనే ఆయన కల నెరవేరుతుంది. ఈ సంఘం భవనం కోసం విశాల్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ దక్షిణ భారత కళాకారుల సంఘం ఆర్టిస్టులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


ఇక సినిమాల విషయానికొస్తే... విశాల్ తాజాగా 'మదగజరాజ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం 'తుప్పరివాలన్ 2'లో నటిస్తున్నారు. సాయిధన్సిక... రజినీకాంత్ 'కబాలి' సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే, తెలుగులో అంతిమ తీర్పు, షికారు, దక్షిణ మూవీస్‌లో నటించారు.