Vishal About Varudu Movie: కొన్నిసార్లు కాల్ షీట్స్ వల్ల లేదా ఇంకేదైనా కారణాల వల్ల నటీనటులు కొన్ని సినిమాలను వదిలేసుకుంటూ ఉంటారు. అది ప్రతీ ఇండస్ట్రీలో కామన్‌గా జరిగే విషయమే. ఆ విషయాన్ని వాళ్లే స్వయంగా చెప్పినప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ వదిలేసుకున్నారా అని ప్రేక్షకులు షాకవుతుంటారు. అలాగే తమిళ హీరో విశాల్ కూడా ఒక సందర్భంలో తనకు లోకేశ్ కనకరాజ్ మూవీలో విలన్‌గా నటించే ఛాన్స్ వచ్చిందని, కానీ తాను చేయలేదని బయటపెట్టాడు. ప్రస్తుతం తను ‘రత్నం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. ఒక తెలుగు సినిమాలో కూడా విలన్ రోల్‌ను రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. 


వద్దులే అనిపించింది..


అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’లో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ముందుగా ఆర్య చేసిన క్యారెక్టర్ తనకు వచ్చిందని బయటపెట్టాడు విశాల్. ‘‘వరుడులో చేయమని గుణశేఖర్ అడిగారు. కానీ నేను అది చేయలేదు. ఏదో తేడా కొడుతుంది వద్దులే అనిపించింది’’ అని రిజెక్ట్ చేయడానికి కారణాలు రివీల్ చేశాడు. ఇక మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘విలన్’ అనే సినిమాలో మాత్రం విశాల్ విలన్‌గా నటించాడు. అంతకు ముందు వచ్చిన విలన్ రోల్స్‌ను రిజెక్ట్ చేసి ‘విలన్‌’లో మాత్రం నటించడానికి కారణమేంటో కూడా విశాల్ చెప్పుకొచ్చాడు.


అది బోనస్..


‘‘మోహన్‌లాల్ హీరోగా వచ్చిన విలన్‌లో నాది పూర్తిగా విలన్ లాంటి పాత్ర కూడా కాదు. నా పాత్ర ప్రకారం సమాజంలో జరిగే విషయాలు నచ్చక నేను హత్యలు చేస్తూ ఉంటాడు. మోహన్‌లాల్ మాజీ సీబీఐ ఆఫీసర్‌గా నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ కథ నాకు నచ్చింది. అంతే కాకుండా ఆయనతో నటించాలి అనే కోరిక కూడా తీరింది. ముందుగా ఆ సినిమాలో క్యారెక్టర్ బాగుంది ప్లస్ ఆయనతో నటించడం బోనస్. రెగ్యులర్‌గా చేసేది కాకుండా కొత్తగా చేసినందుకు అది నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది’’ అని తెలిపాడు విశాల్. ఇక పునీత్ రాజ్‌కుమార్ మరణించిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాలకు, అందులో ఉండే పిల్లలకు సాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పానని, పబ్లిసిటీ కోసం చేయాలనే దరిద్రమైన ఆలోచన తనకు లేదని అన్నాడు.


అలా చేయడం తప్పు..


లవర్స్‌కు ఏదైనా టిప్ ఇస్తారా అని విశాల్‌ను అడగగా.. ‘‘నిజాయితీగా ఉండండి. నేనేం పెద్ద లవ్ గురు కాదు కానీ నేను కూడా ప్రేమించాను కాబట్టి నా అనుభవాలను బట్టి చెప్తున్నాను. మీరు ప్రేమలో పడినప్పుడు ఆ రిలేషన్‌షిప్‌కు న్యాయం చేయండి. ఒక హాబీలాగా ప్రేమించి అమ్మాయి లైఫ్‌ను నాశనం చేయొద్దు. లవ్ ఫెయిల్యూర్‌గా అబ్బాయిలకు ఎంత బాధ ఉంటుందో.. అమ్మాయిలకు అంతకంటే ఎక్కువే ఉంటుంది. జీవితాంతం కలిసుంటాను అంటేనే ప్రేమించండి. హాబీలాగా చేయడం తప్పు’’ అంటూ యూత్‌కు మెసేజ్ ఇచ్చాడు. ఇక విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’.. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.



Also Read: ‘ప్రేమలు’ మూవీకి స్పాయిలర్స్ దెబ్బ - అంత గొప్పగా ఏం లేదంటున్న ఓటీటీ ప్రేక్షకులు, కారణాలివే!