బాక్సాఫీస్ బరిలో హారర్ & థ్రిల్లర్ సినిమాలకు ఎంత సత్తా ఎంతనేది 'విరూపాక్ష' సినిమా మరోసారి నిరూపించింది. దాంతో ఆ జానర్ సినిమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సత్యం' రాజేష్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'మా ఊరి పొలిమేర 2' (Maa Oori Polimera 2 Movie) సినిమాకు క్రేజ్ పెరిగింది.
'సత్యం' రాజేష్ (Satyam Rajesh), కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, 'గెటప్' శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అప్పట్లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇటీవల ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదగా విడుదలైంది.
స్మశానంలో 'సత్యం' రాజేష్ పూజలు!
'మా ఊరి పొలిమేర 2' ఫస్ట్ లుక్ చూస్తే... 'సత్యం' రాజేష్ ముఖాన్ని చూపించలేదు. కానీ, ఆయన స్మశానంలో పూజలు చేస్తున్నట్లు అర్థమయ్యేలా చూపించారు. ఫస్ట్ పార్టులోనూ ఈ విధంగా పూజలు చేసే సన్నివేశాలు ఉన్నాయి. చేతబడి నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఓటీటీలో మొదటి పార్ట్ భయపెట్టింది. దాంతో సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన 'విరూపాక్ష' విజయం కూడా కలిసి వచ్చింది.
Also Read : 'మగధీర' & 'కెజీఎఫ్'కు, అఖిల్ కొత్త సినిమా టైటిల్‌కు ఓ కనెక్షన్!
శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ 'మా ఊరి పొలిమేర 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి పార్టుకు దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్ ఇప్పుడీ రెండో పార్టునూ తెరకెక్కిస్తున్నారు. రాకేందు మౌళి, అక్షత, సాహితి దాసరి, రవి వర్మ, 'చిత్రం' శ్రీను తదితరులు ఇందులో ఇతర ప్రధాన తారాగణం. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
త్వరలో విడుదలకు 'పొలిమేర 2'
నటుడు, ఈ చిత్రంలో కథానాయకుడు 'సత్యం' రాజేశ్ మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర'ను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్... 'మా ఊరి పొలిమేర 2' త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్నిఅదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడు అనిల్ అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత గౌరికృష్ణ నిర్మాణంలో రాజీ పడలేదు'' అని అన్నారు. సీక్వెల్ ఉంటుందా? లేదా? అని చాలా మంది అడిగారని, ఆ ప్రశ్నలకు ఈ ఫస్ట్ లుక్ సమాధానం చెబుతుందని ఆశిస్తున్నట్లు అనిల్ వివరించారు. త్వరలో విడుదల తేదీని నిర్మాత వెల్లడిస్తారని చెప్పారు.
ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంత్రి తలసాని గారికి నిర్మాత గౌరికృష్ణ థాంక్స్ చెప్పారు. 'మా ఊరి పొలిమేర' చూసి ఎగ్జైట్ అయ్యానని, ఆ సినిమా సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2'ను తమ సంస్థలో చేయడం సంతోషంగా ఉందని, ఓ కుటుంబంలా సినిమాను పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : గ్యాని, ఛాయాగ్రహణం : ఖుషేందర్ రమేష్ రెడ్డి.
Also Read : 'బ్రో' అంటున్న మామా అల్లుళ్లు - పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!