సముద్రఖని, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విమానం' (Vimanam Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ 'గుడుంబా శంకర్', బాలకృష్ణ 'మహారథి' చిత్రాల కథానాయిక మీరా జాస్మిన్ (Meera Jasmine) రీ ఎంట్రీ ఇస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్... త్వరలో ఈ సినిమా నుంచి పాట వస్తోంది. 


మే 2న 'రేలా రేలా...' సాంగ్
Rela Rela Song : 'విమానం' సినిమాలో తొలి పాట 'రేలా రేలా...'ను మే 2న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ రోజు తెలిపారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన పాటలో సముద్రఖనిని వికలాంగుడిగా చూపించారు. ఈ సాంగ్ స్టిల్స్ చూస్తే ఆ పాత్రకు యాక్సిడెంట్ కావడానికి ముందు తీసిన పాట ఏమో!?


Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!


జూన్ 9న 'విమానం' విడుదల
జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.



సముద్రఖని ఫస్ట్ లుక్, ప్రోమో చూస్తే...  
Samuthirakani Role In Vimanam Movie : 'విమానం'లో విలక్షణ నటుడు, దర్శక - రచయిత సముద్రఖని పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని అర్థం అవుతోంది. ఈ శుక్రవారం ఆయన ఫస్ట్ లీక్, ప్రోమో విడుదల చేశారు. అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా కన్న కుమారుడిని జాగ్ర‌త్త‌గా చూసుకునే తండ్రి వీర‌య్య పాత్ర‌లో సముద్రఖని న‌టించారు. ప్రోమోలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.   


Also Read మహేష్ కోసం 'అరవింద...'లో బసిరెడ్డి కంటే భయంకరంగా - జగపతి బాబు


వీరయ్య కుమారుడు రాజుకు విమానంలో ప్రయాణించాలని కోరిక. ''విమానం  ఎక్కించావా నాన్నా ఒక్కసారి!'' అని కుమారుడు అడుగుతాడు. ''విమానం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం నాన్నా?'' అని తండ్రి ప్రశ్నిస్తాడు. ''మేఘాల్లో నుంచి కిందకు చూస్తే... కొండలు, చెట్లు, ఇల్లు అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయట నాన్నా'' అని కుమారుడు వివరిస్తాడు. ''బాగా చదువుకుని పెద్దోడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు విమానం'' అని తండ్రి చెబుతాడు. వాళ్ళిద్దరి సంభాషణ, నటన హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. 


''జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ఈ 'విమానం'. తండ్రి కుమారుల అనుబంధంతో పాటు ఎన్నో మంచి అంశాలు మా సినిమాలో ఉన్నాయి'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందట. ప్రోమోకు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. 


జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ ''కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌ సంస్థతో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. భావోద్వేగాల క‌ల‌బోత‌గా బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్ష‌కులు న‌చ్చే కథలు, సినిమాలను అందించ‌ట‌మే మా ల‌క్ష్యం. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాం'' అని చెప్పారు.