రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’ (Kantara Movie). తొలుత కన్నడలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లోకి  అనువాదమై విడుదలైంది. ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతి చోటా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా రేంజిలో కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అందుకుంది.  రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పింది. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ‘కాంతార’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.


భూతకోల వేడుకల్లో పాల్గొన్న రిషబ్ శెట్టి


తాజాగా కర్నాటకలో భూతకోల వేడుకలు (Bhuta Kola Festival) అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రిషబ్ శెట్టి పాల్గొన్నారు. త్వరలో ‘కాంతార 2’ షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో ఆయన ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రధాన్యత సంతరించుకుంది. తాజాగా ఈ వీడియోను రిషబ్ శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.    పంజుర్లీ దైవా నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. తన సినిమాపై దైవ ఆశీర్వాదం ఉండాలని వేడుకున్నారు. ఆ సమయంలో రిషబ్ శెట్టితో పాటు ఆయన సినీ బృందం కూడా అక్కడే ఉంది.



చూసింది ‘కాంతార 2’, రాబోయేది కాంతార 1’


Kantara Prequel : ‘కాంతార’ సినిమా సీక్వెల్ గురించి మేకర్స్ ఇప్పటికే పలు విషయాలు వెల్లడించారుఅదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను దర్శకుడు రిషబ్ శెట్టి తెలిపారు. ‘కాంతార’ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైనట్లు వెల్లడించారు. అయితే, ఈ సినిమా సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అన్నారు. తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో, దానికి ముందు జరిగిన సంఘటనలు రెండో భాగంలో చూపించనున్నట్లు తెలిపారు. గత ఏడాది చూసింది ‘కాంతార 2’ సినిమా కాగా..  రాబోయే సినిమా ‘కాంతార 1’  అన్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ‘కాంతార’ ప్రీక్వెల్ (Kantara Prequel Release Date) 2024లో విడుదలవుతుందని వెల్లడించారు. 


 ప్రీక్వెల్ మూవీలో ఏం ఉండబోతోందంటే?


ఇక ‘కాంతార’ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద చూపించనున్నట్లు చెప్పారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


Read Also: నా చివరి శ్వాస వరకు పోరాడుతా - సూరజ్ పంచోలిని నిర్దోషిగా తేల్చడంపై జియా ఖాన్ తల్లి తీవ్ర అసంతృప్తి