బాలీవుడ్ నటి నటి జియాఖాన్‌ ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్‌ పంచోలీని ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బిడ్డది ఆత్మహత్య కాదు, హత్య అని మరోసారి తేల్చి చెప్పారు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. సూరజ్‌ పంచోలీ తన బిడ్డను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని కోర్టు తేల్చిందని, మరైతే నా బిడ్డ ఎలా చనిపోయిందని ఆమె ప్రశ్నించారు.


తుది శ్వాస వరకు న్యాయం కోసం పోరాడుతా- జియా తల్లి


''న్యాయస్థానం తీర్పు అన్యాయం కాదు. నేను షాక్ అవ్వలేదు. సీబీఐ ఈ పని చాలా కాలం క్రితమే చేసి ఉండాల్సింది. మొదటి రోజు నుంచి, నేను తప్పుడు ఛార్జ్ అని చెబుతున్నాను. ఈ కేసుకు ఆధారాలు లేవని కనుగొనడానికి సీబీఐ వారికి 10 సంవత్సరాలు పట్టింది. వారు అభియోగాలను మార్చి సెక్షన్ 302 (హత్యకు శిక్ష) కింద కేసు పెట్టాలని మొదటి నుంచి చెబుతున్నాను. కానీ, వారు పట్టించుకోలేదు. ఈ తీర్పు తర్వాత నా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను. జియా ఆత్మహత్య గురించి కాదు, ఆ ఆత్మహత్యకు కారణం ఏంటో తేలాలనేది నా కోరిక. దానికి సమాధానం దొరికే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తాను. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. నా బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను. నా కూతుర్ని ఎవరు చంపారో కనుక్కోవడమే దర్యాప్తు సంస్థల పని. 10 ఏళ్ల పోరాటం తర్వాత నేను అలసిపోతానని వారు భావించారు. కానీ నేను అలసిపోలేదు. నా కూతురి మీద నాకు ఎంతో ప్రేమ ఉంది. నా తుది శ్వాస విడిచే వరకు ఆమెను న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను” అని తేల్చి చెప్పారు.      


 హీరోయిన్ జియా ఖాన్‌ ఆత్మహత్య కేసులో ముంబై సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సూరజ్‌ పంచోలీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. 



జూన్ 3, 2013న ఆత్మహత్య చేసుకున్న జియా ఖాన్  


జియా ఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరణానికి ముందు ఆమె ఆరు పేజీల సూసైడ్ నోట్‌ ను రాసింది. సూరజ్‌ తో సహజీవనంలో తలెత్తిన సమస్యలు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, తన కూతురు సూసైడ్ చేసుకునేలా సూరజ్‌ ప్రేరేపించాడంటూ జియాఖాన్‌ తల్లి రబియా పోలీసులను ఆశ్రయించింది. సూరజ్ చేతిలో జియా ఖాన్ శారీరక వేధింపులు. మానసిక హింసకు గురైందనే ఆరోపణలతో IPC సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతను బెయిల్ పై విడుదల అయ్యాడు. అయితే ఈ కేసుపై తమకు అధికార పరిధి లేదని సెషన్స్ కోర్టు చెప్పడంతో 2021లో ప్రత్యేక సీబీఐ కోర్టుకు కేసును బదిలీ చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ జియా తల్లి రబియాతో సహా 22 మంది సాక్షులను విచారించగా, సూరజ్ తరపున న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం సీబీఐ స్పెషల్ కోర్టు,  సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సూరజ్ పంచోలీని దోషిగా నిర్ధారించలేమని వ్యాఖ్యానించారు. అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో జియాఖాన్‌ కు న్యాయం జరగాలంటూ సుమారు పదేళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్న ఆమె తల్లి రబియా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.






Read Also: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్, సబ్‌ స్క్రిప్షన్ ధరలు భారీగా పెంపు, వారికి మాత్రం మినహాయింపు!