ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప 2' (Pushpa 2). భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లపరంగా మాస్ జాతర చూపిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో కంటే హిందీలోనే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. కానీ తాజాగా 'పుష్ప 2' సినిమాను భారీ సంఖ్యలో థియేటర్లలో స్క్రీనింగ్ చేయడంపై ఓ ప్రముఖ హిందీ దర్శకుడు ఫైర్ అయ్యారు.
చాలావరకు సినిమా థియేటర్లలో 'పుష్ప 2' సినిమాను మాత్రమే ప్రదర్శించడంతో అదే టైంలో రిలీజ్ అయిన ఇతర సినిమాలకు తగినన్ని స్క్రీన్స్ దొరకట్లేదని మండిపడ్డారు డైరెక్టర్ విక్రమాదిత్య. ముఖ్యంగా 'పుష్ప 2' కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' సినిమాకు ఇలా జరగడంపై ఆయన నిరాశను వ్యక్తం చేశాడు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ మేరకు ఓ సుదీర్ఘ నోట్ ని పంచుకుని, ప్రస్తుతం 'పుష్ప 2' వల్ల ఇండస్ట్రీలో ఏర్పడ్డ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' సినిమాకు రెండు నామినేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం స్క్రీన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదని, పాయల్ కాపాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాతో పోలిస్తే... 'పుష్ప 2'కి ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025లో రెండు నామినేషన్లు పొందినందుకు డైరెక్టర్ పాయల్ కపాడియాను విక్రమాదిత్య అభినందించి, మరోవైపు 'పుష్ప 2' సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో "ఇలా ఒకే సినిమాకు ఎక్కువ షోలు వేయడం వల్ల... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మరో సినిమా ఆడుతోంది అనే విషయం కూడా ప్రేక్షకులకు తెలీదు. ఒకే మల్టీప్లెక్స్ లో ఒక సినిమాకు రోజుకి 36 షో వేయడం అభినందనీయం" అంటూ సెటైరికల్ గా రాస్కొచ్చారు.
"పుష్ప 2 అనేది బ్లాక్ బస్టర్ మూవీనే. కానీ ఒక సినిమా 3 గంటల 20 నిమిషాలు ఉండడం అనేది థియేటర్లలో సాధారణంగా కంటే ఎక్కువ స్పేస్ ని తీసుకుంటుంది. దీనివల్ల ఇతర సినిమాల స్క్రీనింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి" అని చెప్పుకొచ్చారు. ఇక 'పుష్ప : ది రైజ్' మూవీకి సీక్వెల్ గా 'పుష్ప 2 : ది రూల్' రూపొందిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
మరోవైపు పాయల్ కపాడియా గురించి చెప్పుకోవాలి. ఆమె దర్శకత్వంలో రూపొందిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025లో రెండు నామినేషన్లను పొంది, చరిత్రను లిఖించినది. ఈ సినిమా కోసం ఆమె ఉత్తమ దర్శకురాలు విభాగంలో నామినేట్ అయింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడు విభాగంలో ఇండియా నుంచి ఒక డైరెక్టర్ నామినేట్ కావడం అన్నది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవాలి.
Also Read: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?