Veera Dheera Sooran Cast: ప్రస్తుతం చాలామంది హీరోలలాగానే కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ కూడా భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఆయన అప్‌కమింగ్ మూవీస్ అన్నీ దాదాపుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలే. అందులో ఒకటి ‘వీర ధీర శూరన్’. ఇది ఈ హీరో కెరీర్‌లో 62వ సినిమాగా రానుంది. తాజాగా విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో ఎందరో సీనియర్ నటీనటులు కూడా భాగం కానున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సీనియర్ యాక్టర్ కూడా చేరారు.


కీలక పాత్రలో మలయాళ సీనియర్ యాక్టర్!


చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘వీర ధీర శూరన్’లో ఎస్‌.జె. సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. సీనియర్ నటుడు సిద్ధిక్ కూడా ఇందులో భాగమయినట్టు ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించింది మూవీ టీమ్. ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే కనిపించే ఈ నటుడు... అప్పుడప్పుడు తమిళంలో కూడా సినిమాలు చేశారు. ఇప్పుడు ‘వీర ధీర శూరన్’లో నటించబోయే కీలక నటీనటుల లిస్ట్‌లో సిద్ధిక్ కూడా భాగమయ్యారు. ఇంతే కాకుండా మరెందరో సీనియర్ నటీనటులు కూడా ఈ మూవీలో భాగం కానున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.






టైటిల్ టీజర్ విడుదల...


మార్చి 17న విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ విడుదలయ్యింది. ఇది కేవలం టైటిల్ టీజరే అయినా దీని నిడివి మాత్రం దాదాపుగా 4 నిమిషాలు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీలో విక్రమ్.. కాళి అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో విక్రమ్.. గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాడు. కానీ ఇందులో మాత్రం తను మాస్ అవతార్‌లో కనిపించనున్నాడని టైటిల్ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయిన తర్వాత ‘వీర ధీర శూరన్’ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నాడు ఈ హీరో.



‘తంగలాన్’తో బిజీ..


‘వీర ధీర శూరన్’కు ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... రియా శిబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హెచ్‌ ఆర్‌ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ‘వీర ధీర శూరన్’కు సంగీతాన్ని అందించడానికి రంగంలోకి దిగాడు. ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్‌ను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం విక్రమ్.. ‘తంగలాన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు.



Also Read: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!