మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నోట మరోసారి రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కొన్నేళ్లుగా ఆయన దేశ - రాష్ట్ర రాజకీయాలకు, అదే విధంగా రాజకీయ పరమైన వ్యాఖ్యలు - కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలు మాత్రం ఆయనకు ఎప్పుడూ దూరం కాలేదని చెప్పాలి. మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండటంతో చిరు పేరు ప్రస్తావనకు వస్తోంది. ఆయన పేరు చుట్టూ రాజకీయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏపీ ఎన్నికల అభ్యర్థుల గురించి మాట్లాడారు.
తమ్ముడు పవన్ కళ్యాణే ప్రధాన కారణం!
తాను చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాల ప్రస్తావన తీసుకు రావడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చిరంజీవి చెప్పారు. జనసేన, బీజీపీ, తెలుగుదేశం కూటమికి ఆయన మద్దతు పలికారు. వాళ్లందరూ ఓ కూటమిగా ఏర్పడటం సంతోషమని, మంచి పరిణామం అని చిరంజీవి చెప్పారు. బీజీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకు ఓటు వేయమని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: ఎన్నికలొస్తే ఆర్థిక వ్యవస్థకు ఊపు - రాజకీయ అవినీతి సొమ్ము చెలామణిలోకి వచ్చేస్తుందా ?
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన తనకు చిరకాల మిత్రుడు అని చిరు తెలిపారు. అలాగే, పంచకర్ల రమేష్ బాబు తన అశీసులతో రాజకీయ అరంగేట్రం చేశారని చిరు చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో తొలిసారి పెందుర్తి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి మరోసారి పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. వాళ్లిద్దరితో కలిసి చిరు వీడియో విడుదల చేశారు.
Also Read: 'నేను ఒక్కడినే, చంద్రబాబు 10 మందితో వస్తున్నారు' - తనను 'బచ్చా' అనడంపై సీఎం జగన్ కౌంటర్
జనసేనకు ఐదు కోట్లు ఇచ్చిన చిరంజీవి
రాజకీయంగా తన మద్దతు, తన అశీసులు తమ్ముడికి ఉంటాయని కొన్ని రోజులుగా తన చర్యల ద్వారా చిరంజీవి స్పష్టం చేస్తున్నారు. 'విశ్వంభర' చిత్రీకరణలో తనను పవన్ కళ్యాణ్, నాగబాబు కలవగా... అప్పుడు జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతే కాదు... అబ్బాయ్ రామ్ చరణ్ (Ram Charan)కు కూడా పార్టీకి ఫండ్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు చిరంజీవి మరోసారి పబ్లిగ్గా వీడియో విడుదల చేశారు.
జనసేన వెంట మెగాభిమానులు, చిరు అనుచరులు!
చిరంజీవి పిలుపుతో మెగా అభిమానులు, ఆయన అనుచరులు జనసేన పార్టీ వెంట నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. పలు ప్రాంతాల్లో జనసేన, తెలుగు దేశం, బీజేపీ కూటమికి మద్దతుగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నట్లు గౌండ్ రిపోర్ట్ అందుతోంది.