AP Assembly Elections 2024:  త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులతోపాటు తమపై ఉన్న కేసుల వివరాలను ఆయా నేతలు సమర్పించారు. వీరిలో కొందరికి సంబంధించిన వివరాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆస్తుల్లో కొందరు నేతలు పోటీ పడుతుంటే, మరికొందరు నేతలు కేసుల్లో పోటీ పడుతున్నారు. ఇంకొంత మంది నేతలకు ఆస్తులు కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. అటువంటి కీలక నేతలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూసేద్దాం. 


మాజీ మంత్రి అయ్యన్నపై 17 కేసులు..
మాజీ చింతకాయల అయ్యన్నపాత్రుడు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై 17 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి. అయ్యన్న పేరుతో రూ.5,04,61,500, ఆయన భార్య పేరు మీద రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. అయ్యన్నపాత్రుడిపై నమోదైన కేసుల్లో దళితులపై దూషణలు చేయడం, అధికారులపై చిందులు వేయడం వంటి అనేక కేసులు ఉన్నాయి. 


ఆర్థికంగా బలమైన నేత.. చేతిలో ఉన్నది రూ.18 వేలే..
ప్రముఖ పారిశ్రామిక వేత, ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాగుం శ్రీనివాసులరెడ్డి అఫిడవిట్‌లో సమర్పించిన పలు అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోనే ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న శ్రీనివాసులరెడ్డి చేతిలో రూ.18,529 మాత్రమే నగదు ఉన్నట్టు పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ను ఆయన దాఖలు చేశారు. అఫిడవిట్‌లో ఈ మేరకు కీలక అంశాలను వెల్లడించారు. అలాగే, భార్య వద్ద రూ.6,68,134 నగదు ఉన్నటట్టు పేర్కొన్నారు. ఉమ్మడి కుటటుంబ సభ్యులు వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్తుల కింద తనకు రూ.4,58,40,319 ఉండగా, భార్య పేరుతో రూ.17,96,70,139 ఉన్నట్టు వెల్లడించారు. ఉమ్మడి కుటటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు పేర్కొన్నారు. తన పేరుతో రూ.1.09 కోట్ల స్థిరాస్తులు ఉండగా, భార్య పేరుతో రూ.30,04,44,600 ఉన్నట్టు వెల్లడించారు. ఉమ్మడి కుటుంబం సభ్యులు కింద రూ.4,29,44,876 ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. 


బోండా ఉమాపై 23 కేసులు
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన బోండా ఉమామహేశ్వరరావుపైనా భారీగా కేసులు ఉన్నాయి. ఈ మేరకు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై 23 కేసులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపారు. 2006 నుంచి 2024 ఏప్రిల్‌ వరకు రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. భార్య, కుమారరుడితోపాటు తన పేరిట మొత్తంగా రూ.98,53 కోట్లు విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. 


కారు కూడా లేని కావలి టీడీపీ అభ్యర్థి  
కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి)కి కనీసం కారు కూడా లేదు. ఈ మేరకు తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. స్థిర, చరాస్తులు రూ.153.27 కోట్లుగా పేర్కొన్న ఆయన.. తన పేరు మీద రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరు మీద రూ.31.92 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. కుమార్తె వెన్నెల పేరుతో రూ.5.67 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ కారు లేదంటూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈయనపై ఎటువంటి కేసులు లేవు. 


వేమిరెడ్డి దంపతుల ఆస్తుల విలువ రూ.715 కోట్లు
కోవూరు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్‌ రెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు పేర్కొన్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా, షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. వేమిరెడ్డి దంపతులకు రూ.6.96 కోట్లు విలువచేసే 19 కార్లు ఉన్నట్టు వెల్లడించారు. 


రఘురామకృష్ణంరాజుపై 19 కేసులు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 19 కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసులకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు కలిపి రూ.215.57 కోట్లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్రలో కలిపి మొత్తంగా 19 కేసులు ఆయనపై ఉన్నాయి. బ్యాంకుల్లో రూ.12.60 కోట్లు అప్పులు ఉన్నట్టు వెల్లడించారు. 


సుజనా చౌదరి ఆస్తులు రూ.20 కోట్లుపైనే


విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసులు వివరాలు వెల్లడించారు. సుజనా చౌదరి తన వార్షిక ఆదాయం రూ.20,73,290గా పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా, చేతిలో నగదు రూ.1,18,49,340 ఉన్నట్టు వెల్లడించారు. రూ.34,25,500 విలువైన స్థిరాస్తులు ఉన్నటఉట్టు వెల్లడించారు.


సుజనా చౌదరి భార్య పద్మజ వార్షికాదాయం రూ.10,19,721గా పేర్కొన్నారు. తన బ్యాంకు ఖాతా, చేతిలో 11,477 గ్రాముల బంగారం, 41,250 గ్రాముల వెండితో కలిపి మొత్తం చరాస్తులు విలువ రూ.14,09,27,677గా పేర్కొన్నారు. భార్య పద్మజ పేరుతో రూ.6,89,16,428 విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. మనీలాండరింగ్‌ చట్టం కింద 2016లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, మూడు కేసులు ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో నమోదయ్యాయి.