Vangaveeti Radha is campaigning extensively for the NDA alliance : తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయని వంగవీటి రాధాకృష్ణ కూటమి అభ్యర్థుల తరపున విస్తృతంగా పర్యటిస్తున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. వంగవీటి రంగా అనంతరం ఆ కుటుంబానికి రాజకీయ వారసుడిగా వచ్చిన రాధా రాజకీయపరంగా కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు.  గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేశారు.  ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచారు.  2019తో పాటు తాజా ఎన్నికల్లో ప్రత్యక్షపోటీకి దూరంగా ఉన్నారు. పోటీ చేయక పోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొన్నారు. 


కూటమి నుంచి ప్రచారం చేసే బాధ్యతలను ఈ యువనేతకు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. కూటమి గెలుపే లక్ష్యంగా రాధా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం.  కాపులు, బలిజలు అధికంగా ఉండే నియోజకవర్గంలో వంగవీటి రాధా పర్యటన సాగేలా కూటమి ప్రణాళిక వేసినట్లు సమాచారం. వంగవీటి మోహనరంగాను అభిమానించే నియోజకవర్గాలనూ రాధా టచ్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. 2019లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పర్యటించి TDPకు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు.  


వంగవీటి రాధా ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ప్రజా సమస్యలపై నిలబడ్డారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు.  YCP ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలని విషయాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు.ఇతర పార్టీల నుంచి చాలా ఆఫర్లు వచ్చినా.. రాధా.. తెలుగుదేశంతోనే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఆయనకు సెంట్రల్ టిక్కెట్ ఇస్తామని ఆఫర్ చేశారని చెబుతారు.                                       


వైసీపీలోని కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో వంగవీటి రాధాకు స్నేహం ఉంది. వీరు తరచూ కలిసిన ఫోటోలు బయటకు వస్తూంటాయి. అలా ఫోటోలు  వచ్చినప్పుడల్లా వైసీపీలోకి వంగవీటి రాధా అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వంగవీటి రాధా ఎప్పుడూ వారితో రాజకీయాలు మాట్లాడలేదని ఆయన తాజా అజుగులు నిరూపిస్తున్నాయి.  ప్రస్తుతం కూటమి గెలుపు కోసం బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తున్నారని టీడీపీ చెబుతోంది. తన రాజకీయ భవిష్యత్‌ను పార్టీకి అప్పగించి ప్రచారం మాత్రమే చేసుకుంటూ ఆయన ముందుసుక వెళ్తున్నారు.


వంగవీటి రాధా ప్రచారంతో కూటమి అభ్యర్థులకు కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.   ఇప్పటికే కాపుల తరపున పవన్ కళ్యాణ్.. కూటమిలో ఉండగా వంగవీటి మోహనరంగా అభిమానులు, ఫాలోవర్స్ ఓట్లు రాధా ద్వారా కూటమికి పడే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.