Cm Jagan Comments In Chintapalem Meeting: రాష్ట్రంలో ఐదేళ్లలో ఇంటింటికీ సంక్షేమం అందించామని.. ఎన్నికల్లో తాను ఒక్కడినే వస్తుంటే, 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పది మందితో కలిసి వస్తున్నారని సీఎం జగన్ (Cm Jagan) ఎద్దేవా చేశారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా చింతపాలెం (Chintapalem) వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సింగిల్ గా వస్తోన్న తనను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని అన్నారు. 'ఈ ఎన్నికలు పేదలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతల, పేద సామాజికవర్గాల వారి ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మంచి చేసే మనకు.. మోసాలు, కుట్రలతో వచ్చే వారికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంటింటికీ చేసిన అభివృద్ధిని, మంచిని చెప్పి మీ బిడ్డ ఓట్లు అడుగుతున్నాడు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఐదేళ్ల కాలంలో రూ.2.70 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించాం. నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. వసతి దీవెన, విద్యా దీవెన, రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు చేయూత అందించాం. స్వయం ఉపాధి ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా వంటి పథకాలు అమలు చేశాం. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి పథకాలు లేవు. మంచి చేసే ప్రభుత్వాన్ని అంతా ఆశీర్వదించాలి.' అని జగన్ పిలుపునిచ్చారు.






'నేను బచ్చా అయితే నువ్వు'


తనను బచ్చా అన్న చంద్రబాబు కామెంట్స్ పై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నిన్ను ఏమనాలి.? అంటూ నిలదీశారు. 'ఉక్రోశం, కడుపు మంటతో చంద్రబాబు నా మీద రాళ్లు వేయమంటున్నాడు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవడానికి వారికి అధికారం కావాలట. ఈ మధ్య నన్ను చంద్రబాబు బచ్చా అంటున్నారు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు, సుబాహుడు, హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడిలా నాకు కూటమి నేతలు కనిపిస్తున్నారు. విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు. నువ్వు బచ్చా అంటున్న నేను ఒంటరిగానే ఎన్నికలకు వస్తున్నా. మరి నువ్వెందుకు పది మందితో వస్తున్నావు.?' అంటూ జగన్ నిలదీశారు. 






'చంద్రబాబును నమ్ముతారా.?'


చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదని సీఎం జగన్ విమర్శించారు. 'రైతు రుణమాఫీపై చంద్రబాబు గతంలో మొదటి సంతకం అన్నారు. చేశారా.?. ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా.?. అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం ఇచ్చారా.?. ప్రతి ఊరిని సింగపూర్, హైటెక్ సిటీ చేస్తానన్నారు, చేశారా.?. సూపర్ సిక్స్ అంటూ ఇప్పుడు వస్తున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ వస్తున్నారు. చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్ముతారా.?' అని సీఎం జగన్ ప్రశ్నించారు. సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని అన్నారు.


Also Read: AP Leader Assets: సుజనా ఆస్తులు రూ.20 కోట్లు, వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు - కీలక నేతల ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా