Vikram Latest Look: ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక మూవీ హిట్ అయినా.. అవ్వకపోయినా దానికి సీక్వెల్‌ను సిద్ధం చేసేస్తున్నారు మేకర్స్. తాజాగా తమిళ హీరో విక్రమ్ కూడా తన కెరీర్‌లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ చివరిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’లో హీరోగా కనిపించాడు. తాజాగా తన లుక్‌ను అంతా మార్చేసి స్టైలిష్‌గా తయారయ్యాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూసి విక్రమ్.. తన సినిమాల్లోని ఒకదానికి సీక్వెల్‌లో నటించడానికి సిద్ధమవుతున్నాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
త్వరలోనే దానికి సీక్వెల్..
విక్రమ్.. తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన చిత్రమే ‘మహాన్’. అందులో తండ్రీకొడుకులు కలిసి పోటాపోటీగా నటించారని ప్రేక్షకులంతా మూవీకి ఫిదా అయ్యారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది. కానీ విక్రమ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను ఒక్కసారి అయినా థియేటర్లలో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే విక్రమ్.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే ‘మహాన్ 2’కు సన్నాహాలు మొదలయ్యాయని నెటిజన్లలో అనుమానాలు మొదలయ్యాయి. ‘మహాన్’లో ఎలా అయితే స్టైలిష్‌గా కనిపించాడో.. అచ్చం అదే లుక్‌తో తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడు విక్రమ్.
‘ఆదిత్య వర్మ’తో విమర్శలు..
‘మహాన్’లో విక్రమ్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపించగా.. తనను పట్టుకునే పోలీస్ పాత్రలో ధృవ్ కనిపించాడు. ముందుగా ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ అయిన ‘ఆదిత్య వర్మ’తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్రమ్ వారసుడు ధృవ్. అందులో తన నటనతో ఎక్కువమందిని ఆకట్టుకోలేకపోయాడు. అందరూ తనను ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండతో విమర్శలు చేశారు. కానీ తనలోని ప్రతిభను మొత్తం ‘మహాన్’ ద్వారా బయటపెట్టాడు ధృవ్. పలు సీన్స్‌లో విక్రమ్‌ను మించే యాక్టింగ్ చేశాడని ప్రేక్షకులంతా ప్రశంసలు కురిపించారు. నటుడిగా మాత్రమే కాకుండా సింగర్‌గా, లిరిసిస్ట్‌గా కూడా నిరూపించుకొని తాను మల్టీ టాలెంటెడ్ అని ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు ధృవ్ విక్రమ్.
‘తంగలాన్’ కోసం వెయిటింగ్..
ఇక విక్రమ్ విషయానికొస్తే.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’లో ఆదిత్య కరికాళన్ పాత్రలో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘తంగలాన్’ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విక్రమ్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ‘తంగలాన్’ కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డాడో.. ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. దీంతో పాటు ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్ కూడా చాలా కొత్తగా అనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో అడుగుపెట్టింది ‘తంగలాన్’. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుందని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇంకా మూవీ వర్క్ పూర్తి అవ్వకముందే రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: యాత్ర 2 మేకింగ్ వీడియో చూశారా? - వైఎస్ జగన్ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూడండి!