Varun Dhawan in Stree 2: సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి అందులోనే వరుసగా సినిమాలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. ముందుగా హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ అనేవి మొదలయ్యాయి. ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్‌లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్‌లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ నిర్మాత.. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సీక్వెల్‌లో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.


రెండు పాత్రలు కలిపే ప్రయత్నం..


2018లో దినేష్ విజన్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమే ‘స్త్రీ’. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా, ఏ హడావిడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కానీ బాలీవుడ్‌లో ఎంతోకాలంగా ఎవరూ టచ్ చేయని హారర్ కామెడీ జోనర్‌ను టచ్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది ‘స్త్రీ’. దీంతో తాను ఒక హారర్ కామెడీ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తానని ప్రకటించాడు నిర్మాత దినేష్. అందుకే అదే యూనివర్స్‌లో ‘రూహీ’, ‘భేడియా’ చిత్రాలను తెరకెక్కించాడు. ఇప్పుడు ‘స్త్రీ’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘స్త్రీ 2’లో అన్ని క్యారెక్టర్స్‌ను కలిపే ప్రయత్నాలు మొదలుపెట్టాడు ప్రొడ్యూసర్ దినేష్ విజన్.


రెండు రోజుల కాల్ షీట్స్..


‘భేడియా’లో ఒక వింత జీవి ఆకారంలో కనిపించాడు యంగ్ హీరో వరుణ్ ధావన్. ఇప్పుడు ‘స్త్రీ 2’లో కూడా మరోసారి అదే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం కోసం 2 రోజుల కాల్ షీట్స్‌ను నిర్మాత దినేష్‌కు అందించాడట వరుణ్. ఇక ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేయడం వల్ల ‘భేడియా’ చిత్రానికి సీక్వెల్ కథ ముడిపడి ఉంటుందని బాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ‘స్త్రీ 2’ కోసం వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ కలిసి కామెడీ సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. వరుణ్ పాత్ర కనిపించేది కాసేపే అయినా.. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందట. అంతే కాకుండా దీని ద్వారా ‘భేడియా 2’కు కూడా సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది.


2025లో ప్రారంభం..


‘స్త్రీ 2’ షూటింగ్ సమయంలో దర్శకుడు అమర్ కౌశిక్‌తో కలిసి ‘భేడియా 2’ గురించి చర్చలు జరిపాడట వరుణ్ ధావన్. ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలో కూడా మాట్లాడుకున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ‘స్త్రీ 2’ ఎక్కడ పూర్తవుతుందో.. ‘భేడియా 2’ అక్కడ నుండే మొదలవుతుందని సమాచారం. నిర్మాత దినేష్ విజన్ అనుకున్నట్టుగానే బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడని ఇతర మేకర్స్ అనుకుంటున్నారు. ఇక అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ‘స్త్రీ 2’లో శ్రద్ధా కపూర్‌తో పాటు రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. 2024 ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక 2025లో ‘భేడియా 2’ షూటింగ్ కూడా ప్రారంభం అవ్వనున్నట్టు సమాచారం.


Also Read: హనుమాన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ - భారీగా రెమ్యునరేషన్‌ పెంచిన తేజ సజ్జా! ఎంతంటే..