Vijay Sethupathi Emotional Words About Ramojirao: మీడియా మొఘల్ రామోజీరావు మరణవార్త విన్న ఎంతోమంది కన్నీళ్లు పెట్టారు. సినీ నటుడు, బుల్లితెర నటులు అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కారణం ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవ. షూటింగ్స్ కోసం ఆయన నిర్మించిన అద్భుతమైన రామోజీ ఫిలిమ్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ ఫిలిమ్ సిటీలో సినిమా షూటింగ్ చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే రామోజీ మరణం అందరినీ కలవరపెడుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ గొప్ప మనిషి అని అన్నారు. మహారాజా సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఆయన తన స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు రామోజీ రావును గుర్తు చేసుకున్నారు. ఆయనకు నివాళులర్పించి స్పీచ్ మొదలుపెట్టారు.
ఆయన విజన్, ఆలోచనలు సూపర్..
"చాలామంది నన్ను హైదరాబాద్ తో మీ మెమొరి ఏంటి అని అడుగుతారు. హైదరాబాద్ అనగానే నాకు గుర్తొచ్చేది రామోజీ ఫిలిమ్ సిటీనే. 2005లో షూటింగ్ కి వచ్చాను. చాలాటైం అక్కడే గడిపేవాడిని. అప్పుడే నాకు రామోజీరావు గారి గురించి తెలిసింది. అప్పుడే ఆయన గొప్పతనం గురించి తెలిసింది. ఒక సినిమా తీయాలంటే ఏమేమి కావాలో అవన్నీ ఆయన క్రియేట్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. మార్కెట్, స్లమ్ ఏరియా, పార్క్ ఏది కావాలంటే అది ఫిలిమ్ సిటీలో ఉంది. ఫుడ్, హోటల్ అన్నీ ఉండేవి. ఆయన గురించి, ఆయన విజన్ గురించి తెలిసి ఆయన మీద రెస్పెక్ట్ పెరిగింది. ఆయన లేరనే వార్త చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ కోసం మీరు చేసిన ప్రతి విషయానికి ధన్యవాదాలు సార్" అంటూ రామోజీరావు కి నివాళులు అర్పించారు విజయ్ సేతుపతి.
ఈనాడు, ఈటీవీ, ప్రియ పచ్చళ్లు, మార్గదర్శి లాంటి ఎన్నో సంస్థలు నెలకొల్పి, అంతర్జాతీయ స్థాయిలో రామోజీ ఫిలిమ్ సిటీని నిర్మించిన ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి కల్పించారు రామోజీరావు. మీడియా, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్నో సేవలు చేశారు ఆయన. ఫిలిమ్ సిటీలో అయితే దాదాపు కొన్ని వేల సినిమాలు షూటింగ్ జరిగాయి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలకు సంబంధించి ఎన్నో సినిమాలు ఇక్కడే షూట్ చేశారు. అంతటి గొప్ప వ్యక్త రామోజీరావు. శనివారం ఉదయం 4.50 నిమిషాలకి మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించగా ఆదివారం ఉదయం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో ఫిలిమ్ సిటీలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నస్మృతి వనంలో కొడుకు కిరణ్ కుమార్ తలకొరివి పెట్టారు.
ఇదిలా ఉండగా.. విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి 50వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. మమతా మోహన్ దాస్, నట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: నేను బాలకృష్ణకి పెద్ద ఫ్యాన్.. ఆ రోజు ఆయన్ను కౌగిలించుకున్నా: విజయ్ సేతుపతి