Vijay Deverakonda Family Star Song: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు.  'నందనందనా..' అంటూ సాగే ఈసాంగ్ ప్రేక్షకులను  ఆకట్టుకుంటోంది.   


‘ఫ్యామిలీ స్టార్’ నుంచి తొలి పాట విడుదల


‘ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా.. ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చక.. ప్రాణాన్ని గుచ్చీ గుచ్చక.. చిత్రంగా చెక్కింది దేనికో..’ అంటూ సాగే ‘ఫ్యామిలీ స్టార్’  పాట సినీ అభిమానులను బాగా అలరిస్తోంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన విధానం వారెవ్వా అనిపిస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ  పాటలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హైదరాబాద్‌‌‌‌లోని ఛార్మినార్ సహా పలు లొకేషన్స్, మెట్రో ట్రైన్‌ ‌‌‌లో ఈ సాంగ్‌‌‌‌ ను షూట్ చేశారు. రిచ్ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.


‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్ పై నెటిజన్ల ట్రోలింగ్


అటు ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్ మీద సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్ కొనసాగుతోంది. సాంగ్‌లా లేదు, షాంపూ యాడ్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎడిటెడ్ వీడియోలతో ఈ పాటను ట్రోల్ చేస్తున్నారు. మీమర్స్ సైతం తమ మార్క్ క్రియేటివిటీతో ఈ పాటను విమర్శిస్తున్నారు.






ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’


ఇక పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇప్పటికే ‘గీత గోవిందం’ సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. వీరిద్దరు కలిసి చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, చాలాసార్లు వాయిదా పడి ఏప్రిల్ 5న విడుదలకు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ, పోటీ పెరగడంతో సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ఫిబ్రవరీలో విడుదల అవుతుందని వార్తలు వినిపించాయి. కానీ, ఫిబ్రవరిలో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో అక్కడ నుండి కూడా తప్పుకొని ఏకంగా ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్ చేశారు. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఆ సినిమా ఆలస్యం అవ్వడంతో పోస్ట్‌ పోన్ అయ్యింది. ఆ స్థానంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.


Read Also: ఈ వీకెండ్ అదిరిపోయే మూవీస్ - ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు