Family Star Fourth Day Collections: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ మొదటిరోజే మిక్స్‌డ్ రివ్యూలతో ఆటలను ప్రారంభించుకుంది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో కాస్త పరవాలేదు అనిపిస్తూనే వస్తోంది. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ వీకెండ్‌ను పూర్తి చేసుకొని, మొదటి వీక్ డేలోకి అడుగుపెట్టింది. అయితే మొదటి సోమవారం ఈ మూవీకి కలెక్షన్స్ కాస్త తగ్గాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ విషయాలకంటే నెగిటివ్ విషయాల గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడంతో కలెక్షన్స్‌పై దీని ప్రభావం పడిందని తెలుస్తోంది.
కలెక్షన్స్ ఎంతంటే.?
పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలయ్యింది. సినిమా విడుదలకు వారం రోజుల ముందే మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. విజయ్ దేవరకొండ అయితే స్వయంగా తానే వెళ్లి పలువురు ఫ్యాన్స్‌ను కలిసి సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పటివరకు ‘ఫ్యామిలీ స్టార్’కు రూ.13.55 కోట్లు కలెక్షన్స్ సాధించిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మొదటి సోమవారం.. ఈ మూవీ రూ.1.25 కోట్ల కలెక్షన్స్‌ను చూసినట్టు తెలుస్తోంది. అయితే మామూలుగా రౌడీ హీరో సినిమా అంటే ప్రేక్షకులు ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసుకుంటారు. కానీ ఈమధ్య విజయ్ నటిస్తున్న సినిమాలు.. ఆ అంచనాలు అందుకోలేక యావరేజ్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. దానికి ‘ఫ్యామిలీ స్టార్’ కూడా ఉదాహరణగా మారింది.
మరో ‘గీతా గోవిందం’ కాదు..
ఇప్పటికే దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘గీతా గోవిందం’లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ యూత్‌ను మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ‘గీతా గోవిందం’ మ్యాజిక్ కూడా మళ్లీ రిపీట్ అవుతుందని ప్రేక్షకులు ఆశించారు. కానీ అలా జరగలేదు. ప్రమోషన్స్ సమయంలో సైతం ‘ఫ్యామిలీ స్టార్’ అనేది ‘గీతా గోవిందం’కు డబుల్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఆ రేంజ్‌లో మూవీ లేదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ గోల్డెన్ లెగ్ కూడా ఈ మూవీని బ్లాక్‌బస్టర్ వైపు నడిపించలేకపోతుందని కొందరు విమర్శిస్తున్నారు.
కథ ఏంటంటే..
కథ విషయానికొస్తే.. గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) మిడిల్ క్లాస్ కుర్రాడు. అన్న, వదినలతో పాటు వారి పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ల ఇంట్లో పెంట్ హౌజ్‌లో రెంట్‌కు వస్తుంది ఇందు (మృణాల్ ఠాకూర్). తను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది. మెల్లగా గోవర్ధన్‌తో, తన ఫ్యామిలీతో కలిసిపోతుంది. అలా ప్రేమలో కూడా పడతారు. ఆ తర్వాతే ఇందు గురించి ఒక విషయం తెలిసి వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత గోవర్ధన్, ఇందు జీవితాల్లో జరిగే మార్పులు ఏంటి? మళ్లీ వాళ్లిద్దరు ఎలా కలిశారు అనేదే కథ. ఇక ఇందుగా మృణాల్, గోవర్ధన్‌గా విజయ్.. ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు.
Also Read: తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి' - ఏ ఓటీటీలో రిలీజ్, హీరో హీరోయిన్లు ఎవరంటే?